
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 16 మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి : కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులు పోటెత్తడంతో శనివారం రాత్రి న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో తొక్కిసలాట జరిగింది. ఈ విషాద ఘటనలో 18 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. మృతుల్లో 11 మంది మహిళలు, నలుగురు చిన్నారులున్నారు. 14,15 ప్లాట్‌ఫాంలపై ఈ దుర్ఘటన జరిగింది.ఈ ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అయితే మృతులపై రైల్వేశాఖ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. ఘటనపై మాత్రం అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించింది.తొక్కిసలాటలో మరణాలు చోటుచేసుకున్నట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ధ్రువీకరించారు. తొక్కిసలాట నేపథ్యంలో రద్దీని నివారించేందుకు నాలుగు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. అనూహ్య రద్దీ కారణంగా తొక్కిసలాట జరిగినట్లు వెల్లడించారు. 14వ నంబరు ప్లాట్‌ఫాంపై ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ నిలిచి ఉండడంతో మహా కుంభమేళాకు వెళ్లే భక్తులు అక్కడకు చేరుకున్నారు. స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆలస్యం కావడంతో వాటి కోసం వచ్చిన ప్రయాణికులు అదే సమయంలో 12, 13, 14 నంబరు ప్లాట్‌ఫాంలపై ఉన్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడ రద్దీ పెరిగిపోయి తొక్కిసలాటకు దారితీసినట్లు భావిస్తున్నారు.