
మారుమూల గ్రామాలలో ప్రతి ఇంటికి త్రాగునీరు అందాలి..
గ్రామాల్లో ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలి..
సదరం శిబిరాల్లో అన్ని సదుపాయాలు కల్పించాలి..
పెండింగ్ ధరణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి…
అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.
పయనించే సూర్యుడు మార్చి 04 (పొనకంటి ఉపేందర్ రావు) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మంగళవారం ఐ డి ఓ సి కార్యాలయం నుండి జిల్లాలోని ఆర్డీవోలు, జడ్పీ సీఈవో, తాసిల్దార్లు, నీటిపారుదల శాఖ అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీ ఓలు మరియు ఏటీఎం లతో స్వయం సహాయక బృందాల ద్వారా పెట్రోల్ బంకు నిర్వహణ, యు డి ఐ డి సదరం, పెండింగ్ ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తులు, వేసవి ముందస్తు జాగ్రత్తలు , పెండింగ్ ధరణి దరఖాస్తుల పరిశీలన మరియు త్రాగునీటి సమస్యలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ మాట్లాడుతూ.. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని మరియు వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు బ్యాంకు ద్వారా రుణాలు ఇచ్చి ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుందన్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో మహిళలు పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తుందన్నారు. ఈ పెట్రోల్ బంక్ స్థాపన కొరకు జిల్లాలో రహదారి పక్కన 10 కుంటల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించవలసిందిగా అధికారులను ఆదేశించారు. సదరం శిబిరాలలో వైకల్య నిర్ధారణ కోసం వచ్చేవారికి అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ అధికారులు ఆదేశించారు. సదరం సేవలను సులభతరం చేస్తూ ఇటీవల కొత్తగా యూనిక్ డిజేబులిటీ ఐడి ( యు డి ఐ డి ) పోర్టల్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో సదరం సర్టిఫికెట్ల కోసం ఇకనుండి యు డి ఐ డి పోర్టల్ ద్వారానే దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. దరఖాస్తుదారులు సదరం శిబిరానికి ఎప్పుడు హాజరు కావాలనేది ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందుతుందని ఆయన తెలిపారు. దరఖాస్తు సమయంలో అక్షర దోషాలు, ఇతర తప్పులు కు ఆస్కారం లేకుండా మీసేవ నిర్వాహకులకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఇప్పటివరకు ఐదు రకాల కేటగిరీల దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేదని కొత్తగా రూపొందించిన యు డి ఐ డి హోటల్లో 21 రకాల కేటగిరీలను చేర్చారని కలెక్టర్ వెల్లడించారు. సదరం సర్టిఫికెట్లను స్మార్ట్ కార్డు రూపంలో పోస్టల్ శాఖ ద్వారా ఇంటికి పంపిస్తారని ఆయన తెలిపారు.రానున్న వేసవి కాలంలో ఎండల తీవ్రత మరియు వడగాలను అధికంగా నమోదు అయ్యే అవకాశం ఉన్నందున త్రాగునీటి ఎద్దడి రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మారుమూల గ్రామాల్లోని ప్రతి ఇంటికి త్రాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని, నీటి సరఫరా లో తలెత్తే సమస్యలను త్వరితగతిన పరిష్కరించి అంతరాయం లేకుండా నీటి సరఫరా అందించాలన్నారు. గ్రామంలోని ప్రతి ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలు నిర్మించేలా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. శిధిలావస్థలో ఉన్న పాఠశాలలను గుర్తించి నివేదికలను త్వరితగతిన అందించాలని అధికారులను ఆదేశించారు. శిథిలావస్థలో ఉన్న తరగతి గదులను కూల్చి వేసవి సెలవులు నాటికి పనులు ప్రారంభించి సెలవులు అనంతరం పాఠశాలల ప్రారంభం నాటికి నూతన భవనాలను నిర్మిస్తామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలో సీడ్ బ్యాంక్ లను నిర్వహించాలని, విద్యార్థులకు విత్తనాల సేకరణ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ఇప్ప,కరక్కాయ ముష్టి, సుబాబులు ఏ పాఠశాలలో అధికంగా విత్తనాలను సేకరిస్తారో వారికి ప్రోత్సాహక బహుమతులు ఉంటాయని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ధరణి మాడ్యూల్ లో ఉన్న దరఖాస్తుల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో పరిశీలించి పెండింగ్ లో లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అన్ని దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలని, పెండింగ్ దరఖాస్తులు ఏ కారణం తోటి పరిష్కరించలేదో ఈ సమాచారాన్ని పోర్టల్ లో నమోదు చేయాలని ఆదేశించారు. పెండింగ్ ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్ అన్నారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు, కలెక్టర్ విద్యా చందన, జిల్లా వైద్య శాఖ అధికారి భాస్కర్ నాయక్, ఆర్ ఎం ఓ రమేష్, మిషన్ భగీరథ ఈ ఈ లు నలిని, తిరుమలేష్, డి ఎల్ పి ఓ భద్రాచలం సుధీర్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ షర్ఫుద్దీన్ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.