పైపైన మరమ్మతులు.. పెను ప్రమాదానికి అధికారులే కారణమా?
పయనించే సూర్యుడు జూన్ 26 (సూళ్లూరుపేట నియోజకవర్గ0 రిపోర్టర్ దాసు) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో నాదెండ్లవారి కండ్రిగ గ్రామంలో కాళంగి నదికి వెళ్లే కల్వర్ట్ వద్ద ఉన్న పాత లాకు గేట్లు పూర్తిగా శిథిలావస్థకు చేరి ఎప్పుడు కూలిపోతాయోనన్న భయాందోళన నెలకొంది. దాదాపు 30 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ గేట్లు గోడలు పగుళ్లతో బలహీనపడినా, వాటిని పూర్తిగా పునర్నిర్మించకుండా పైపైన సిమెంట్ పూత వేసి వదిలేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. భారీ వర్షాలు, అధిక నీటి ప్రవాహం సమయంలో ఈ నిర్మాణం కూలిపోయే ప్రమాదం ఉందని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కాకుండా ముందస్తుగా శాశ్వత చర్యలు తీసుకుని కొత్త లాకు గేట్లు నిర్మించాలని స్థానికులు అధికారులను డిమాండ్ చేస్తున్నారు. నిర్లక్ష్యం కొనసాగితే ప్రజలకు, సాగునీటి వ్యవస్థకు తీవ్ర నష్టం తప్పదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.