స్వర్గీయ ముద్రగడ పద్మనాభం మరణం రాష్ట్రానికి తీరని లోటు

July 15, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు జూలై 15 (ముమ్మిడివరం గ్రంధి నానాజీ) భౌతికకాయానికి నివాళులర్పించిన మంత్రులు వాసంశెట్టి సుభాష్, కందుల దుర్గేష్ కిర్లంపూడి:కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు శ్రీ ముద్రగడ పద్మనాభం గారి మరణం రాష్ట్ర రాజకీయాలకు, సామాజిక ఉద్యమాలకు తీరని లోటని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో శ్రీ ముద్రగడ పద్మనాభం గారి భౌతికకాయానికి నివాళులర్పించిన అనంతరం మంత్రులు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడిన నాయకుడిగా, విలువలతో కూడిన రాజకీయాలకు ప్రతీకగా నిలిచిన వ్యక్తిగా ముద్రగడ పద్మనాభం గారు చిరస్మరణీయులుగా నిలిచిపోతారని అన్నారు.1978లో తొలిసారిగా శాసనసభ్యుడిగా ఎన్నికైన ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, కాకినాడ లోక్‌సభ సభ్యుడిగా ప్రజలకు సేవలందించారని గుర్తు చేశారు. ప్రజల హక్కుల సాధన కోసం, ముఖ్యంగా కాపు సమాజ అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి విశేషమని కొనియాడారు.సుదీర్ఘ రాజకీయ అనుభవం, నిబద్ధత, ప్రజా సేవ పట్ల అంకితభావం కలిగిన ముద్రగడ పద్మనాభం గారి మరణం బాధాకరమైన సంఘటన అని మంత్రి సుభాష్ అన్నారు. ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నాయకుడిగా ఆయన ఎల్లప్పుడూ ప్రజల హృదయాల్లో నిలిచి ఉంటారని పేర్కొన్నారు.మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం గారు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన నాయకుడని, ఆయన సేవలు భావితరాలకు ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. సమాజ శ్రేయస్సు కోసం ఆయన చేసిన కృషిని ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని తెలిపారు. స్వర్గీయ ముద్రగడ పద్మనాభం గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, ఆయన సతీమణి, కుమారులు, కుమార్తె, కుటుంబ సభ్యులు, అభిమానులు, మద్దతుదారులకు మంత్రులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా టీడీపీ అధ్యక్షులు గుత్తుల సాయి, ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు, కాపు సంఘాల నేతలు, ప్రజలు, ముద్రగడ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని నివాళులర్పించారు.

🌐 Select Language:
📰 ePaper