గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం ముమ్మర గాలింపు చర్యలు
కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలి – మంత్రి వాసంశెట్టి సుభాష్
పయనించే సూర్యుడు ఆగస్టు 18 ముమ్మిడివరం (ప్రతినిధిగ్రంధి నానాజీ)డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నుంచి చేపల వేటకు వెళ్లి గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ కోసం అధికారులు ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారని రాష్ట్ర కార్మిక, ఫ్యాక్టరీలు, బీమా వైద్య సేవల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు.గల్లంతైన మత్స్యకారుల కుటుంబ సభ్యులతోను, అధికారులు తోనూ అమరావతి నుంచి ఫోన్ ద్వారా మాట్లాడిన మంత్రి, ప్రభుత్వం ఈ ఘటనను అత్యంత ప్రాధాన్యతతో పరిగణిస్తోందని చెప్పారు. జిల్లా అధికార యంత్రాంగం, ఇండియన్ కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీ, మెరైన్ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ సముద్రంలో విస్తృత స్థాయిలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు వివరించారు.ఓడలరేవు గ్రామానికి చెందిన కొపనాతి రామకృష్ణవర్మతో పాటు మరో ఆరుగురు మత్స్యకారులు ఆగస్టు 3న చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లారని, ఇప్పటికే వెనక్కి తిరిగి రావాల్సి ఉన్నప్పటికీ నేటివరకు వారి ఆచూకీ లభించకపోవడం ఆందోళన కలిగిస్తోందని మంత్రి పేర్కొన్నారు. వేటకు వెళ్లిన తర్వాత మూడు రోజుల వరకు కుటుంబ సభ్యులతో ఫోన్ ద్వారా మాట్లాడిన మత్స్యకారులు, అనంతరం అందుబాటులోకి రాకపోవడంతో కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురయ్యాయని తెలిపారు.ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు మంత్రి సుభాష్ భరోసా కల్పించారు. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ లభించే వరకు ప్రభుత్వం వారి కుటుంబాలకు అండగా ఉంటుందని, గాలింపు చర్యలు మరింత వేగవంతం అయ్యేలా సంబంధిత అధికారులతో నిరంతరం సమీక్షిస్తున్నామని చెప్పారు.మత్స్యకారుల కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. గల్లంతైన మత్స్యకారుల జాడ కనిపించే వరకు అధికార యంత్రాంగం విశ్రాంతి లేకుండా పనిచేస్తుందని ఆయన తెలిపారు.