ప్రభుత్వ కళాశాల తరలింపు ప్రయత్నాలను నిలిపివేయాలి.
స్పోర్ట్స్ గ్రౌండ్ కోసం దళిత,బహుజన,పేద విద్యార్థుల భవిష్యత్తును తాకట్టు పెట్టీ చీకట్లోకి నెట్టేస్తారా?
విద్యాశాఖ నుండి క్రీడా శాఖకు భూమిని అప్పజెప్తున్నట్టు ఎలాంటి ఉత్తర్వులు లేకపోయినా చర్యలు చేపట్టడం చట్ట విరుద్ధం.
శిథిలావస్థకు చేరిన కళాశాలను కూల్చి అదే స్థలంలో కొత్తగా నిర్మించాలి.PDSU,AYAM,SFI
పయనించే సూర్యుడు ఆగస్టు 25మక్తల్ PDSU,AYAM,SFI విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో మక్తల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల తరలింపు ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి ,మక్తల్ నియోజకవర్గ శాసనసభ సభ్యులు డా.వాకిటి శ్రీహరి గారు స్పోర్ట్స్ గ్రౌండ్ ను నిర్మాణం చేయడం కోసం కళాశాలను శాశ్వతంగా కిరాయి భవనంలోకి మార్చడమంటే మక్తల్ మండల దళిత,బహుజన,పేద వర్గాల భవిష్యత్తును చీకట్లోకి నెట్టేయడమవుతుందన్నారు.చాలా కాలంగా విద్యార్థి,ప్రజా సంఘాల నాయకులు,పత్రిక ప్రతినిధులు కళాశాల శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా తరగతి గదుల పైకప్పుల పెచ్చులు ఊడి పడుతుండటంతో కొత్తగా విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా కళాశాల భవనంను నిర్మించాలని,అలాగే కళాశాలలో కనీసం మరుగుదొడ్లు కూడా లేకపోవడాన్ని ప్రశ్నిస్తూ వాటిని నిర్మించాలని డిమాండ్ చేసినప్పటికీ ఈనాటికీ నెరవేరలేదన్నారు.చట్ట ప్రకారం విద్యాశాఖ నుండి ముఖ్యంగా ఇంటర్ బోర్డు నుండి స్పోర్ట్స్ అథారిటీకి ఆ స్థలాన్ని అప్పజెప్తున్నట్లు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు.ఇలాంటి పరిస్థితుల్లో స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించిన క్రీడా మైదానాన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన భూమిలో కట్టాలనుకోవడం చట్ట విరుద్ధమైన చర్య దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాము.క్రీడల కంటే విద్యార్థుల భవిష్యత్తుకే మొదటి ప్రాధాన్యత ఇచ్చి,మరోచోట క్రీడా మైదానాన్ని నిర్మించాలన్నారు.అలా కాకుండా స్పోర్ట్స్ గ్రౌండ్ కోసం జిల్లాలోనే ఎక్కడ లేనివిధంగా దాదాపు 600 మందికి పైగా విద్యార్థులున్న కళాశాలను ఇరుకిరుకు గదులు,ప్రమాణాలకు దూరంగా ఉండే కిరాయి భవనంలోకి తరలిస్తే వారి చదువులు సజావుగా సాగడం సాధ్యం కాదని అది ముమ్మాటికి వారి జీవితాలతో చెలగాటమాడటమే అవుతుందన్నారు. స్పోర్ట్స్ గ్రౌండ్ కోసం కళాశాలను తరలించొద్దని,అందుకోసం చేసే ప్రయత్నాలను వెంటనే నిలిపివేయాలని కోరుతున్నాము. ఇందుకోసం విద్యార్థులతో సంతకాల సేకరణను కూడా చేపట్టామన్నారు.అదే విధంగా చాలా మంది మక్తల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివి,వివిధ రంగాలలో ఉన్నత స్థానంలో నసాగుతున్నారని,అంతటి చారిత్రక ప్రాధాన్యత గల కళాశాలపై గతంలో ప్రైవేటు వ్యక్తులు కుట్రలు చేశారని ఇప్పుడు కూడా అలాంటి కుట్రలు చేసేందుకు అవకాశం లేకపోలేదని పూర్వ విద్యార్థులు,ప్రజలందరూ గమనించలన్నారు.కాబట్టి శిథిలావస్థకు చేరిన కళాశాలను కూల్చి,కళాశాల శాశ్వత భవనాన్ని అక్కడే నిర్మించాలనే డిమాండ్ కు ప్రజలు మద్దతు తెలపాలన్నారు.ప్రభుత్వ జూనియర్ కళాశాలను యధా స్థితిలో కొనసాగించకపోతే, ఆ కళాశాల భూములను కాపాడకపోతే భవిష్యత్తులో ఐక్య ఉద్యమాలను నిర్మిస్తామని హెచ్చరిస్తున్నాము.ఈ కార్యక్రమంలో PDSU జిల్లా సెక్రెటరీ మహేష్,AYAM నియోజకవర్గ అధ్యక్షులు పృథ్వీరాజ్,SFI జిల్లా ఉపాధ్యక్షులు మహేందర్,SFI మమత ప్రతినిధి సంఘాల నాయకులు తల్వార్ నరేష్,అంబ్రేష్,బసవరాజు, భాస్కర్, రాధా, త్రివేణి, కృష్ణ విష్ణు,తరుణ్,రవి తదితరులు పాల్గొన్నారు.