తిరువనంతపురం, జనవరి 06: బస్సు లోయలో పడిన దుర్ఘటనలో నలుగురు ప్రయాణికులు మరణించగా.. మరో32 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన కేరళలోని కొటరక్కర-దిండిగల్ జాతీయ రహదారిపై సోమవారం చోటు చేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు. అందులోభాగంగా క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే బ్రేక్ ఫెయిల్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీస్ ఉన్నతాధికారులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులోని తాంజావూర్ పర్యటనకు వెళ్లిన యాత్రికులు తిరిగి స్వస్థలం అలప్పుజా జిల్లాలోని మావెలిక్కరకు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందన్నారు. ఇడుక్కి జిల్లాలోని కల్లివాయల్ ఎస్టేట్ సమీపంలో ఈ రోజు ఉదయం ఈ దుర్ఘటన చోటు చేసుకుందని వివరించారు. ఈ ప్రమాదంలో మరణించిన నలుగురు మృతులు.. అరుణా హరి (55), రామ్మోహన్ (40), సంగీత (45), బిందు ఉన్నితాన్ (59)గా గుర్తించామన్నారు. వీరంతా మావెలిక్కర వాసులను చెప్పారు. పర్వత ప్రాంతంలో మలుపు తిరిగే క్రమంలో బస్సు బ్రేకులు ఫెయిల్ అయి.. అదుపు తప్పి 70 అడుగుల లోతు ఉన్న భారీ లోయలోకి పడి పోయిందన్నారు. స్థానికులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, విపత్తు నిర్వహణ సంస్థకు చెందిన సిబ్బంది సహయంతో.. సహాయక చర్యలు చేపట్టామని పోలీస్ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఈ ప్రమాదానికి గురైన బస్సు కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు అని వారు పేర్కొన్నారు.
లోయలో పడిన బస్సు.. నలుగురు మృతి, 32 మందికి గాయాలు
RELATED ARTICLES