సినిమా వార్తలు

రైతుల పంటలను కాపాడాలి..

రైతుల పంటలను కాపాడాలి..

వ్యవసాయ శాఖ అధికారుల చేత పంటల నష్టంపై సమగ్ర సర్వే చేపట్టాలి

నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలి..

బీజేపీ రాష్ట్ర నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్

( పయనించే సూర్యుడు అక్టోబర్ 18 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )రైతుల పంటలు ఎండిపోకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని బీజేపీ రాష్ట్ర నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈరోజు వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, గ్రామాల వారీగా వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, రైతులు సాగు చేసిన పంటల పరిస్థితిపై సమగ్ర సర్వే నిర్వహించాలని కోరారు. ఏ గ్రామంలో ఎన్ని ఎకరాల్లో పంటలు సాగు చేశారు, ఎక్కడ నీటి కొరత ఉంది, ఎన్ని ఎకరాల్లో పంటలు ఎండిపోయే పరిస్థితి ఉందనే వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిక అందించాలన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు విద్యుత్ శాఖతో సమన్వయం చేసుకొని, పంటలు ఎండిపోకుండా ప్రతి ఎకరానికి అవసరమైన నీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయానికి సరిపడా నిరంతర విద్యుత్ సరఫరా కల్పించి, రైతులు సాగు చేసిన పంటలను కాపాడేందుకు అధికారులు బాధ్యతతో పనిచేయాలని అన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా లేదా నీటి కొరత, విద్యుత్ సమస్యల వల్ల పంట నష్టం జరిగితే, నష్టాన్ని క్షేత్రస్థాయిలో అంచనా వేసి, అర్హులైన రైతులకు నిబంధనల ప్రకారం తగిన పంట నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రైతులు అప్పులు చేసి, పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేస్తున్నారని, చివరి దశలో పంటలు ఎండిపోతే వారి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. అందువల్ల ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకొని పంటలను కాపాడటంతో పాటు, నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బిజెపి సీనియర్ నాయకులు విజయ్ భాస్కర్, మండల అధ్యక్షులు చిట్టెం లక్ష్మీకాంతరెడ్డి, అత్తాపూర్ మహేందర్ రెడ్డి, కడియాల కుంట సర్పంచ్ రాజు నాయక్, సీనియర్ నాయకులు బోయ శంకర్, కుడుముల బాలరాజ్, కృష్ణ యాదవ్, ప్రశాంత్ గౌడ్, గణేష్ నాయక్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS