పేద, మధ్య తరగతి ప్రజలు ఏవైనా ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు పొందాలంటే ఇప్పటివరకు కొలబద్ధ రేషన్ కార్డు. అందుకే ప్రతి సామాన్య కుటుంబం రేషన్ కార్డు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తుంటారు. ప్రతినెలా తీసుకునే రేషన్ కంటే ప్రభుత్వం అందించే ఇతర సంక్షేమ పథకాలకు ప్రభుత్వాలు రేషన్‌కార్డు తప్పనిసరి నిబంధన పెట్టడంతో ఆ కార్డుకు ఎక్కువ డిమాండ్ ఉంది. తెలంగాణలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డులు వస్తాయని ప్రజలు ఎదురుచూసినా ఫలితం దక్కలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. కొత్త రేషన్ కార్డుల జారీకి మంత్రిమండలి ఇటీవల ఆమోదం తెలపడంతో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న జనంలో మళ్లీ ఆశలు చిగురించాయి. అయితే ఈ రేషన్ కార్డు కోసం ఏమి చేయాలి, ఎలా పొందాలనే అనుమానాలు చాలామందికి ఉండొచ్చు. జనవరి 26వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు జారీచేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. ఈ క్రమంలో కొత్త కార్డు పొందాలంటే ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.