రామేశ్వరంలో గంగలా పొంగుతున్న మద్యం
దేవాలయ భూముల పరిధిలోనే విచ్చలవిడిగా కల్లు , మద్యం విక్రయాలు
పట్టించుకోని దేవాదాయ శాఖ అధికారులు
రాత్రింబవళ్లు మద్యం ప్రియుల పారవశ్యం
ఎక్సైజ్ శాఖ చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న వైనం
దేవాలయ పరిసర ప్రాంతాల్లో భక్తులకు తీవ్ర ఇబ్బందులు
పట్టించుకోని ఆలయ నిర్వాహణ అధికారి
ఆగ్రహానికి గురవుతున్న పరమేశ్వరుడి భక్తులు
( పయనించే సూర్యుడు జనవరి 31 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జి మెగావత్ నరేందర్ నాయక్)
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని ఫరూఖ్ నగర్ మండలం శ్రీ రామలింగేశ్వర దేవాలయం (రామేశ్వరం) పవిత్రతను కొందరు దెబ్బతీస్తున్నారు. ఆలయ ప్రాంగణంలోనే విచ్చలవిడిగా మద్యాన్ని సేవిస్తున్నారు. ఇది పట్టించుకోవాల్సిన దేవాదాయశాఖ అధికారులు నిమ్మకునీరెత్తినట్లు చోద్యం చూస్తున్నారు. అత్యంత పవిత్రమైన రామేశ్వరం దేవాలయంలో ఈ తతంగం రోజు వారిగా చోటు చేసుకుంటున్న భాగోతం దేవాలయ ప్రాంగణంతో పాటు పరిసరాల చుట్టూ మద్యం ప్రియులు తిష్ట వేశారు. కల్లు, మద్యం, సారాయి ప్రియులు రోజువారీగా రాత్రివేళలో స్వేచ్ఛగా సేద తీరుతున్నారు. పగటిపూట గుడి చుట్టుపక్కల మద్యం సేవిస్తుండగా ఇక రాత్రి వేళల్లో ఎలాంటి అడ్డు అదుపు లేకుండా దేవాలయ పరిధిలోనే మద్యం సేవిస్తున్నారు. ఉదయం పూట ఈ పరిసరాలను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఎక్కడ చూసినా ఖాళీ సీసాలు దర్శనం ఇస్తున్నాయి. పొద్దున్నే భక్తులు గుడికి వెళుతూ ఈ పాపాన్ని కళ్లారా వీక్షిస్తున్నారు. స్వామి రథం, దేవాలయ పరిసర ప్రాంతాలో కూడా ఖాళీ సీసాలు కనిపిస్తున్నాయి. ఈ ఘోరం వెలుగు చూస్తున్న ఆలయ సిబ్బంది పట్టించుకకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. పరమేశ్వర ఇదేం ఖర్మయ్య అంటూ భక్తులు పెదవి విరుస్తున్నారు. ఈ పరమేశ్వరుడి దేవాలయం షాద్ నగర్ నియోజకవర్గ మండల కేంద్రమైన ఫరూఖ్ నగర్ నుండి కేవలం 7 కి. మీ. దూరంలోను, సమీప రాజధాని హైదరాబాద్ నుండి 55 కి. మీ. దూరంలోనూ ఉంది. ఎంతో పవిత్ర పుణ్యక్షేత్రమైన రామేశ్వరం ప్రాంతానికి భక్తులు రాష్ట్రవ్యాప్తంగా దర్శనానికి వస్తూ ఉంటారు. శివరాత్రి పర్వదినం సమయంలో పక్షం రోజుల పాటు జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఎంతో ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం మహిమానిత్వం గురించి అందరికీ తెలుసు. ఇక్కడ ప్రతి ఏటా స్వామి వారి లింగం ఎదుగుతూ ఉంటుంది. శ్రీరాముడు సీతాన్వేషణలో భాగంగా ఈ దండకారణ్యంలో శివ లింగాన్ని ప్రతిష్టించినట్టు చరిత్ర చెబుతోంది. దేవాదాయ శాఖలో ఉన్న ఈ రామేశ్వరం ఆలయం పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత గ్రామ ప్రజాప్రతినిధులపై పాలకవర్గం పై అదేవిధంగా దేవాదాయ శాఖ అధికారులపై ఉంది. ఆలయం సంరక్షణ, పవిత్రత గురించి పట్టించుకోకపోవడం దారుణాతి దారుణం. రాత్రిపూట విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు మద్యం ప్రియుల భాగోతం కొనసాగుతున్నప్పటికీ పట్టించుకునే వారే కరువయ్యారు. ఉదయాన్నే ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఖాళీ మద్యం సీసాలు దర్శనం ఇస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఆలయ నిర్వాహకులు పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భక్తులు మాత్రం ఈ తతంగం పై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆలయ పరిరక్షణను పట్టించుకోకపోతే తామే స్వయంగా రంగంలోకి దిగాల్సి వస్తుందని భక్త సమాజం హెచ్చరిస్తోంది. మరి దేవదాయశాఖ అధికారులు, పాలకవర్గం ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిన అవసరం ఉందని భక్తులు కోరుతున్నారు.