అమిత్ షా దత్తపుత్రుడు ఫొటోలు బయటపడ్డాయి—డీకే శివకుమార్‌తో ప్రత్యేక సందర్భం
పయనించే సూర్యుడు న్యూస్ :ప్రధాని కార్యాలయంలో ఉన్నతాధికారిగా, అమిత్ షా దత్తపుత్రుడిగా నమ్మించి, ఓ వైద్యుడిని రూ.2.7 కోట్లకు మోసం చేసిన హై-ప్రొఫైల్ కేటుగాడు సుజయేంద్రను విజయనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆసుపత్రి అనుమతులు ఇప్పిస్తానని హామీ ఇచ్చి ఈ మోసానికి పాల్పడ్డాడు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, పలువురు ప్రముఖులతో ఫోటోలను చూపించి నమ్మించాడు. విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.తాను ప్రధానమంత్రి కార్యాలయంలో పనిచేసే ఉన్నతాధికారినని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దత్తపుత్రుడిని అని చెప్పుకుంటూ ఒక వైద్యుడిని ఏకంగా రూ.2.7 కోట్లకు మోసం చేసిన హై-ప్రొఫైల్ కేటుగాడిని విజయనగర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని విజయనగర్ నివాసి అయిన సుజయ్ అలియాస్ సుజయేంద్రగా గుర్తించారు. పోలీసుల నివేదికల ప్రకారం.. నిందితుడు సుజయ్ జమ్మూ కశ్మీర్‌కు చెందిన ఒక వైద్యుడిని సంప్రదించి, ఉన్నత వర్గాల్లో తనకు ఉన్న పలుకుబడిని ప్రదర్శించాడు. వైద్యుడి నమ్మకాన్ని సంపాదించడం కోసం అతను ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్‌తో వేదిక పంచుకున్న ఫొటోలను చూపించాడు.దేవనహళ్లి సమీపంలో అత్యాధునిక విల్లా తరహా ఆయుర్వేద ఆసుపత్రి ప్రారంభించడానికి అవసరమైన ప్రభుత్వ అనుమతులను తాను సులభంగా మంజూరు చేయిస్తానని సుజయేంద్ర హామీ ఇచ్చాడు. ఈ హామీని నమ్మిన వైద్యుడి నుండి ఆసుపత్రి అనుమతులు, ఇతర సాకుల పేరుతో విడతల వారీగా సుజయేంద్ర మొత్తం రూ.2.7 కోట్లు వసూలు చేశాడు. మోసపోయిన వైద్యుడు ఫిర్యాదు చేయడంతో, విజయనగర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించి సుజయేంద్రను అరెస్టు చేశారు. విచారణలో అతని పాత నేర చరిత్ర బయటపడింది. మోసాలకు పాల్పడేందుకు సుజయేంద్ర ఒక ఐఏఎస్ అధికారి బంధువుతో సాన్నిహిత్యాన్ని పెంచుకున్నాడు. అంతేకాక పలు మఠాల సాధువులు, కర్ణాటక ప్రభుత్వంలోని సీనియర్ నాయకులతో వేదికను పంచుకున్న ఫోటోలను చూపించి తాను పెద్ద వీఐపీని అని చెప్పుకునేవాడు. గతంలోనూ అతడు పలు నేరాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే రెండుసార్లు జైలు శిక్ష అనుభవించినట్లు విచారణలో తేలింది. అతనిపై ఇప్పటికే 4 చెక్ బౌన్స్ కేసులు ఉన్నాయి. ఇన్ని మోసం కేసులు ఉన్నప్పటికీ అతను ఉప ముఖ్యమంత్రితో ఒక వేదికను పంచుకోవడం ఎలా సాధ్యమైందనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అతను ఇంకా ఎవరినీ మోసం చేశాడు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.