PS Telugu News
Epaper

అవగాహనతోనే సోషల్ మీడియా పోస్టులు పెట్టాలి…అభ్యంతరకర పోస్టులపై అడ్మిన్‌లే బాధ్యులు: డీఎస్పీ టి ఎస్ ఆర్ కె ప్రసాద్

📅 13 Feb 2026 ⏱️ 5:12 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 13 ముమ్మిడివరం ప్రతినిధి

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో చేసే పోస్ట్‌లు సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతాయని, అందువల్ల వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌లు, వినియోగదారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని అమలాపురం డీఎస్పీ టి.ఎస్.ఆర్.కె.ప్రసాద్ సూచించారు. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు అమలాపురంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం ఉదయం సోషల్ మీడియా దుర్వినియోగం, శాంతిభద్రతల (లా అండ్ ఆర్డర్) సమస్యలపై వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌లు, వినియోగదారులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ ప్రసాద్ మాట్లాడుతూ, సోషల్ మీడియాలో వచ్చే సందేశాలు, పోస్టులు ప్రజల్లో అపోహలు సృష్టించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రమాదం ఉందన్నారు. ముఖ్యంగా వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌లు పాటించవలసిన నిబంధనలు, చట్టపరమైన పరిణామాలపై వివరించారు.
వాట్సాప్ గ్రూపుల్లో రెచ్చగొట్టే పోస్టులు, మత విద్వేషాలను పెంపొందించే సందేశాలు ప్రచారం జరిగితే గ్రూప్ అడ్మిన్‌లు బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. అభ్యంతరకర పోస్టులను వెంటనే తొలగించాలని సూచించారు. వాస్తవాలు నిర్ధారించుకోకుండా నకిలీ వార్తలను (ఫేక్ న్యూస్) షేర్ చేయడం వల్ల శాంతిభద్రతలకు ముప్పు వాటిల్లుతుందని, అలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యక్తిగత దూషణలు, మహిళల గౌరవానికి భంగం కలిగించే పోస్టులు, తప్పుడు ప్రచారాలకు పాల్పడితే ఐటీ చట్టం ప్రకారం కఠిన శిక్షలు ఉంటాయని స్పష్టం చేశారు.
సమాజంలో అశాంతిని రేకెత్తించే ప్రయత్నాలు ఎవరు చేసినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. సోషల్ మీడియాను సమాచార మార్పిడి, సామాజిక ప్రయోజనాలకే పరిమితం చేయాలని, దాన్ని వేధింపులు లేదా తప్పుడు ప్రచారాలకు వేదికగా మార్చుకోవద్దని డీఎస్పీ సూచించారు.
కార్యక్రమంలో అమలాపురం పట్టణ సీఐ పీ వీరబాబు, రూరల్ సిఐ ప్రశాంత్ కుమార్ సబ్‌డివిజన్ పరిధిలోని సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు, వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌లు, సోషల్ మీడియా వినియోగదారులు పాల్గొన్నారు.

Scroll to Top