PS Telugu News
Epaper

అశ్వాపురం గ్రామపంచాయతీలో విద్యుత్ స్తంభాల కొరత – ఏఈకి మెమోరాండం అందజేత

📅 06 Feb 2026 ⏱️ 3:13 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు, ఫిబ్రవరి 06,అశ్వాపురం:

అశ్వాపురం మండలం, అశ్వాపురం గ్రామపంచాయతీ పరిధిలో అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ సరైన విద్యుత్ స్తంభాలు, విద్యుత్ లైన్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై స్పందించిన గ్రామపంచాయతి సర్పంచ్ మరియు ఉపసర్పంచ్ ఈరోజు అశ్వాపురం మండల విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ అనుదీప్ కి మెమోరాండం అందజేశారు. గ్రామపంచాయతీలలో కొత్తగా ఏర్పడిన కాలనీలు, వ్యవసాయ ప్రాంతాలు, నివాస ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు లేకపోవడం వల్ల కరెంటు సరఫరా సక్రమంగా లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని వారు మెమోరాండంలో వివరించారు. ముఖ్యంగా వర్షాకాలం, ఎండాకాలంలో గాలులు వీచిన సమయంలో విద్యుత్ తీగలు తెగిపడి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందని తెలిపారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలుగా కొత్త విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని, విద్యుత్ లైన్లను సక్రమంగా విస్తరించాలని కోరారు. అశ్వాపురం గ్రామపంచాయతీల పరిధిలో సుమారు యాభై విద్యుత్ స్తంభాలు అత్యవసరంగా అవసరమున్నాయని మెమోరాండంలో పేర్కొన్నారు.ప్రజల భద్రత, సౌకర్యాల దృష్ట్యా ప్రభుత్వం ఈ విద్యుత్ స్తంభాలను ఉచితంగా గ్రామపంచాయతీ పరిధిలో మంజూరు చేయాలని సర్పంచ్, ఉపసర్పంచ్ మరియు గ్రామపంచాయతీ సెక్రటరీ మల్లేశం కోరారు. ఈ సమస్యపై సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

Scroll to Top