ఎర్ర జొన్న మొక్కజొన్న రైతులకు న్యాయం చేయాలి
పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్
సిండికేట్ గా మారి ఎర్ర జొన్న రైతులను నిలువుగా ముంచుతున్న వ్యాపారులు ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని మద్దతు ధర కల్పించాలి అసెంబ్లీ లో రైతుల సమస్యలు ప్రస్థావించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఈ రోజు బుధవారం రోజున జీరో అవర్ లో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి రైతాంగం ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలపై గళమెత్తారు.
నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో ప్రధానంగా సాగయ్యే ఎర్రజొన్న, మొక్కజొన్న పంటల మద్దతు ధర మరియు యాప్ వల్ల యూరియా పంపిణీలో జరుగుతున్న జాప్యంతో రైతులు పడుతున్న ఇబ్బందులపై ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు.నిజామాబాద్ జిల్లాలో ప్రత్యేకంగా పండించే ‘ఫోడర్ జవార్’ (ఎర్రజొన్న) రైతులకు వ్యాపారులు సిండికేట్‌గా మారి అన్యాయం చేస్తున్నారని వేముల ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది క్వింటాల్‌కు రూ. 3,800 పలికిన ధర, ఈ ఏడాది సాగు విస్తీర్ణం తగ్గినప్పటికీ వ్యాపారులు కుమ్మక్కై రూ. 3,000 కు తగ్గించారని విమర్శించారు. దీనివల్ల ఎకరాకు రూ. 10 వేల వరకు రైతులకు నష్టం వాటిల్లుతోందని, వెంటనే కలెక్టర్ జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించి ఎర్రజొన్న రైతులకు మద్ధతు ధర లభించేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.
కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం మొక్కజొన్నకు క్వింటాల్‌కు రూ. 500 బోనస్ వెంటనే ప్రకటించాలని కోరారు. ప్రస్తుతం మార్కెట్‌లో మద్దతు ధర రూ. 2,400 ఉండగా, కొనుగోలు కేంద్రాలు లేక రైతులు రూ. 1,600-1,700 కే అమ్ముకుంటున్నారని, తద్వారా ఎకరాకు రూ. 32 వేల వరకు నష్టపోతున్నారని గణాంకాలతో వివరించారు. ప్రభుత్వం తక్షణమే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని కోరారు.
యూరియా పంపిణీ కోసం ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన యాప్ విధానాన్ని ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు.గ్రామీణ ప్రాంతాల్లో 75% మంది రైతులకు స్మార్ట్ఫోన్లు వాడటం రాదని, యాప్ ద్వారా బుక్ చేసుకోవడం పెద్ద సమస్యగా మారిందని అన్నారు.గతంలో యూరియా గడప వద్దకే వచ్చేదని, ఇప్పుడు మండలం మొత్తం తిరగాల్సి వస్తోందని విమర్శించారు.ఒకేసారి యూరియా ఇవ్వకుండా విడతల వారీగా ఇస్తుండటంతో, ఒక 4 ఎకరాలు రైతు సుమారు 6 రోజుల పాటు యూరియా కోసం తిరగాల్సి వస్తోందని మండిపడ్డారు.యూరియా స్టాక్స్‌ను మండల కేంద్రాల్లో కాకుండా, ప్రతి సొసైటీ అందుబాటులో ఉంచాలని సూచించారు.రైతుల మనోభావాలను ప్రతిబింబిస్తూ.. “కేసీఆర్ ఉన్నప్పుడు ఆటో వాడికి డబ్బులిస్తే పొలం దగ్గరికి యూరియా సంచులు వచ్చేవి, ఇప్పుడు ఈ యాప్‌లు, తిప్పలు ఎందుకు?” అని రైతులు ప్రశ్నిస్తున్నారని వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.ప్రభుత్వం తక్షణమే స్పందించి ఎర్రజొన్న, మక్కజొన్న రైతులకు మద్దతు ధర లభించేలా మరియు యూరియా ఇబ్బందులు తొలగించేలా రైతులకు భరోసా కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
