ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు—“అదే జరిగితే పదవికి రాజీనామా చేస్తా!”
పయనించే సూర్యుడు న్యూస్ :అన్నమయ్య జిల్లాకు రాయచోటిని జిల్లా కేంద్రంగా కొనసాగించే విషయంలో దుష్ప్రచారాన్ని నమ్మవద్దని రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. మంత్రి పదవిని నిలబెట్టుకోవడానికి జిల్లా కేంద్రాన్ని తరలించడానికి తాను ఒప్పుకున్నాననేది అవాస్తవమని, అలాంటిది జరిగితే రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ తనపై దుష్ప్రచారం చేస్తోంది అన్నారు అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిగానే కొనసాగుతుందని, కార్యాలయాల ఏర్పాటుకు స్థలాల కొరత ఉందని తెలిపారు.అదే జరిగితే తాను పదవికి రాజీనామా చేస్తానంటున్నారు రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి . రాయచోటిని జిల్లా కేంద్రంగా కొనసాగించే విషయంలో తనపై వైఎస్సార్‌సీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దన్నారు. తాను మంత్రి పదవిని నిలబెట్టుకోవడానికి జిల్లా కేంద్రం రాయచోటిని తరలించడానికి ఒప్పుకున్నానంటూ తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. రాయచోటి నుంచి జిల్లా కేంద్రాన్ని తరలించడానికి తాను ఒప్పుకోలేదని, అలాంటిది జరిగితే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు. రాయచోటి అన్నమయ్య జిల్లా కేంద్రంగానే కొనసాగుతుందని తేల్చి చెప్పారు. తాను స్వయంగా జిల్లాల పునర్విభజన కమిటీ సభ్యులతో మాట్లాడానని.. ఈ ప్రాంత పరిస్థితులు, జిల్లా కేంద్రానికి ఉన్న అనుకూలత, అభివృద్ధి తీరును వివరించానన్నారు.అన్నమయ్య జిల్లా కేంద్రం అభివృద్ధి కోసం కార్యాలయాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు తెలిపారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. అయితే కార్యాలయాల కోసం స్థలాలు దొరకడం లేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ భూములను రాజకీయ నేతలు, వారి అనుచరులు వారి పేర్లపై రాసేసుకున్నారన్నారు. కలెక్టరేట్‌కు కేటాయించిన భూములను రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి తన బంధువుల పేరిట దొంగ రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని ఆరోపించారు. అప్పట్లో పత్రికల్లో వచ్చిన వార్తలతో కలెక్టరేట్ భూముల రిజిస్ట్రేషన్లు రద్దు చేశారని.. స్థలం కేటాయిస్తే సబ్‌జైల్ ఏర్పాటు చేయడానికి డీజీపీ అంగీకరించారని చెప్పుకొచ్చారు.మరోవైపు ఏపీ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు, ప్రస్తుతం ఉన్న జిల్లాల్లో కొన్ని మార్పులు చేసింది. కడప జిల్లాలోని ఒంటిమిట్ట, సిద్దవటం మండలాలు రాజంపేట రెవెన్యూ డివిజన్‌లోకి మార్చాలని నిర్ణయించారు. అప్పుడు రాజంపేట నియోజకవర్గ పరిధిలోని మండలాలన్నీ అన్నమయ్య జిల్లా పరిధిలోకి వస్తాయి. అలాగే పీలేరు కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తున్నారు.. పీలేరు నియోజకవర్గంలోని పీలేరు, గుర్రంకొండ, కలకడ, కంభంవారిపల్లి, కలికిరి, వాల్మీకిపురం.. పుంగనూరు నియోజకవర్గంలోని సదుం, సోమలలు పీలేరు రెవెన్యూ డివిజన్‌లోకి వస్తాయి. అంతేకాదు మదనపల్లె పేరుతో కొత్త జిల్లా ఏర్పాటు కానుంది. అది కూడా అన్నయయ్య జిల్లా నుంచి విభజించి మదనపల్లె జిల్లాను ఏర్పాటు చేస్తున్నారు.