
పయనించే సూర్యుడు న్యూస్ :శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వరాలయం (చిన్న తిరుపతి)లో జరిగిన ప్రమాదం తెలుగు రాష్ట్రాలను కలచివేస్తోంది. ఏకాదశి నాడు 9 మంది చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. అసలు ప్రమాదానికి కారణాలేంటి…? నిర్వాహకుల నిర్లక్ష్యమా…? అసలేం జరిగింది..? అనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది మరణించారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిని పలాస ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమం ఉండగా.. టెక్కలి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతులు చిన్నమ్మ (50), విజయ(48), నీలిమ (60), యశోద(56), రాజేశ్వరి(60), రూప, నిఖిల్(13), బృందావతి(52), అమ్ములు(55) లుగా పోలీసులు ప్రకటించారు. ఈ ఘటన శనివారం ఉదయం 11.45 నిమిషాలకు జరిగిందని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో ఏడుగురు మరణించగా.. ఇద్దరు ఆసుపత్రిలో మరణించినట్లు అధికారులు తెలిపాురు. రెయిలింగ్ విరిగిపడటంతో తొక్కిసలాట జరిగిందని.. 20 మందికి పైగా భక్తులు గాయపడినట్లు అధికారులు తెలిపారు.
ప్రైవేట్ టెంపుల్.. అనుమతులే లేవు.. అసలే ఏకాదశి… ఎప్పట్లానే భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని తెలుసు. అందుకు తగ్గట్లే ఏర్పాట్లు చేయాలి. కానీ నిర్వాహకులు అవేం పట్టించుకోనట్లు తెలుస్తోంది. అసలు ఏకాదశి ఏర్పాట్లకు అనుమతులే తీసుకోలేదని ప్రభుత్వం కూడా ప్రకటించింది.
మరీ దారుణమేంటంటే… దర్శనానికి వెళ్లి వచ్చే క్యూలైన్ ఒకటే ఉండటం. దేవుడి దర్శనం కోసం ఎంట్రీ, దర్శనం అనంతరం ఎగ్జిట్ ఒకటే ఉండటం… 25వేల మంది భక్తులు ఆలయానికి రావడం కూడా ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.ఆలయంలో ఇంకా నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏకాదశి కావడంతో ఓవైపు భక్తులు పెద్దఎత్తున వస్తున్నా కూడా పనులు ఆపకుండా కొనసాగిస్తుండటం కూడా ఓ కారణంగా చెబుతున్నారు అక్కడున్న భక్తులు. అలా నిర్మాణ పనులు జరుగుతున్న చోటే ఈ తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. అదే నిర్మాణాలు ఆపేసి… ఎంట్రీ, అండ్ ఎగ్జిట్‌కు వేర్వేరు క్యూలైన్ కేటాయిస్తే ఇంత దారుణం జరిగేది కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి బాధిత కుటుంబాలు. ఎంట్రీ, ఎగ్జిట్ ఒకటే అయినప్పుడు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. కానీ అక్కడే నిలువెత్తు నిర్లక్ష్యమే కనిపిస్తోంది. భక్తులకు దర్శనానికి వెళ్తే మెట్ల దగ్గర రెయిలింగ్ బలహీనంగా ఉండటం…భక్తులు ఒకరిని ఒకరు తోసుకోవడంతో వీక్‌గా ఉన్న రెయిలింగ్ ఒక్కసారిగా ఊడిపోయింది. ఊహించని నష్టం జరిగింది.
3 వేలే అనుకుంటే.. 25 వేల మంది వచ్చారు.. 3 వేల మంది అనుకున్నారు… కానీ 25 మంది వచ్చారు. అలాంటప్పుడు నిర్వాహకులు తక్షణ చర్యలు చేపట్టాలి. వాలంటీర్లను పెంచాలి… తోపులాటలు జరగకుండా ఎక్కడికక్కడ రోప్‌లు ఏర్పాటు చేయాలి. కానీ ఆలయంలో అలాంటి ముందస్తు చర్యలేం జరగలేదు. అనుకున్న దానికంటే ఎక్కువమంది వచ్చినప్పుడు నిర్వాహకులు ఏం చేయాలి…? ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని పోలీసులను ఆశ్రయించాలి… కానీ అక్కడ అలాంటిదేం జరగలేదు. నిర్వాహకుల అంచనా 3 వేలు.. వచ్చింది 25 వేలు. సో సింపుల్‌గా చేతులెత్తేశారు. 9 మంది అమాయకుల చావులకు కారణమయ్యారు.