కృష్ణదేవిపేట ఎస్ఐ తారకేశ్వరరావు నాతవరం పిఎస్ కు బదిలీ యువతను క్రీడల వైపు మళ్లించి, ఉద్యోగాలకు ప్రోత్సహించిన తారకేశ్వరరావు
పయనించే సూర్యుడు న్యూస్. సెప్టెంబర్ 14. (గొలుగొండ మండల ప్రతినిధి ఎన్. చిరంజీవి)
గొలుగొండ మండలం కృష్ణదేవిపేట పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న వై.తారకేశ్వరరావు బదిలీపై ప్రజలు స్పందించారు. ఆయనను నాతవరం పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. నేరాల నియంత్రణలో కఠిన వైఖరిని అవలంబించిన తారకేశ్వరరావు దొంగతనాలు, చైన్ స్నాచింగ్, గంజాయి రవాణా వంటి నేరాలను అరికట్టడంలో విశేష కృషి చేశారు. రాత్రి పూట పెట్రోలింగ్ పెంచడం, అనుమానితులను విచారించడం, పాత నేరస్తులపై నిఘా ఉంచడం వంటి చర్యలతో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గించగలిగారు. అంతేకాకుండా యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండేలా క్రీడల వైపు మళ్లించారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు తన సొంత నిధులతో స్టేషనరీ అందజేసి ఉత్సాహపరిచారు. తాజాగా నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో ఈ ప్రాంతం నుంచి పది మంది యువత ఎంపిక కావడానికి ఆయన ప్రోత్సాహమే ప్రధాన కారణమని ప్రజలు అభిప్రాయపడ్డారు. ప్రజల్లో విశేష అభిమానం పొందిన తారకేశ్వరరావు బదిలీతో కృష్ణదేవిపేట స్టేషన్‌కు కొత్త ఎస్ఐ వచ్చే వరకు గొలుగొండ ఎస్ఐ పి.రామారావు ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.