గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

పయనించె సూర్యుడు ఫిబ్రవరి 21(పొనకంటి ఉపేందర్ రావు )భద్రాదికొత్తగూడెం:గ్రామపంచాయతీ సర్వతోముఖాభివృద్ధికి సర్పంచుల పాత్ర అత్యంత కీలకమని, ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేసే దిశగా సమగ్ర ప్రణాళికతో కట్టుదిట్టంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి. పాటిల్ పేర్కొన్నారు. శనివారం డాక్టర్ మన్మోహన్ సింగ్ ఇనిస్ట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాత క్యాంపస్ నందు నిర్వహించిన రెండవ విడత నూతన సర్పంచుల శిక్షణ కార్యక్రమం ముగింపు సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని సర్పంచులకు దిశానిర్దేశం చేశారు.జిల్లాలోని అశ్వరావుపేట, దమ్మపేట, దుమ్ముగూడెం, ములకలపల్లి, జూలూరుపాడు, టేకులపల్లి, ఇల్లందు, లక్ష్మీదేవిపల్లి మండలాలకు చెందిన మొత్తం 233 మంది నూతన సర్పంచులకు 17-02-2026 నుండి 21-02-2026 వరకు శిక్షణ కార్యక్రమం నిర్వహించబడినట్లు కలెక్టర్ తెలిపారుసర్పంచులు పంచాయతీరాజ్ చట్టంపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని, గ్రామస్థాయిలో ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించేందుకు చట్టబద్ధమైన అధికారాలు మరియు బాధ్యతలను సముచితంగావినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. శిక్షణ కార్యక్రమంలో గ్రామపంచాయతీల పరిపాలన విధానం, గ్రామాభివృద్ధి కార్యాచరణ ప్రణాళికల రూపకల్పన, బడ్జెట్ నిర్వహణ, ఆర్థిక పారదర్శకత, ప్రజల భాగస్వామ్యం, సామాజిక బాధ్యత వంటి అంశాలపై సమగ్ర అవగాహన కల్పించబడినట్లు తెలిపారు.ప్రభుత్వం అమలు చేస్తున్న కుటుంబ సంక్షేమం, విద్య, ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, సామాజికాభివృద్ధి, పేదరిక నిర్మూలన తదితర సంక్షేమ కార్యక్రమాలు గ్రామస్థాయిలో సమర్థవంతంగా అమలవ్వాలంటే సర్పంచులు నాయకత్వ లక్షణాలతో ముందుండాలని ఆయన అన్నారు. గ్రామాల్లో ప్రాథమిక సదుపాయాల కల్పన, శుద్ధి త్రాగునీటి సరఫరా, రహదారుల అభివృద్ధి, విద్యుత్ సదుపాయం, పారిశుద్ధ్య నిర్వహణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.శిక్షణలో నేర్చుకున్న అంశాలను గ్రామ ప్రజల శ్రేయస్సు కోసం కార్యాచరణలో పెట్టి, ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు సర్పంచులందరూ సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. శిక్షణ పూర్తిచేసుకున్న సర్పంచులకు ఈ సందర్భంగా ధ్రువీకరణ పత్రాలు అందచేశారు .కార్యక్రమం ముగింపు సందర్భంగా నూతనంగా ఎన్నికైన సర్పంచులు జిల్లా కలెక్టర్‌ను సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో డీపీఓ సుధీర్, శిక్షణ డీపీఓ అనూష, డీఎల్పీఓలు ప్రభాకర్, రమణ, టీజీఐఆర్టీ సెంటర్ హెడ్ సుభాష్ చంద్ర గౌడ్, ట్రైనర్లు బన్సింగ్, రవీందర్ రెడ్డి, సునీల్ కుమార్, ముత్యాలరావు, హజ్‌రత్ వలి, ఏపీవో రంగ, ఎస్‌బీఎం రేవతి, డిటిఎం సందీప్, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.