జనసేన ‘కాఫీ విత్ కార్యకర్త’ కార్యక్రమంలో పాత్రికేయుల సమస్యలపై గళమెత్తిన జర్నలిస్టు పవన్
పయనించే సూర్యుడు జనవరి 5 నంద్యాల జిల్లా రిపోర్టరు జి పెద్దన్న
జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ‘కాఫీ విత్ కార్యకర్త’ కార్యక్రమంలో పాత్రికేయులు ఎదుర్కొంటున్న సమస్యలను నంద్యాల జర్నలిస్టు పవన్ జనసేన పార్టీ నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వర్కింగ్ జర్నలిస్టులు అనేక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా భద్రత, జీవనోపాధి, నివాస సమస్యలు వారిని వెంటాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు ఉచితంగా సభ్యత్వాలు ఇవ్వాలని, అలాగే జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు జనసేన పార్టీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. జనసేన పార్టీ సభ్యత్వ రుసుము ఒక్కొక్కరికి రూ.500గా ఉండగా, అందులో రూ.300ను నంద్యాల జనసేన పార్టీ నాయకులు మారాసు గురు బాబు, పెద్ద మనసుతో భరిస్తానని ప్రకటించగా, మిగిలిన రూ.200ను రద్దు చేసి జర్నలిస్టులకు ఉపశమనం కల్పించాలని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి అధినాయకత్వానికి వివరించాలని పవన్ విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా వర్కింగ్ జర్నలిస్టులకు ఇండ్లు లేదా ఇండ్ల స్థలాలు కేటాయించే అంశాన్ని కూడా అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లి తమ సమస్యలను నెరవేర్చాలని కోరారు. జర్నలిస్టుల సంక్షేమానికి జనసేన పార్టీ భవిష్యత్తులో కీలక పాత్ర పోషించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ అంశాలపై స్పందించిన జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు కొణిదెల సునీల్ మాట్లాడుతు,జర్నలిస్టుల సమస్యలను కచ్చితంగా పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మరో నాయకుడు భవనాసి వాసు మాట్లాడుతు,పార్టీ నంద్యాల నియోజకవర్గ జర్నలిస్టులకు ఎంతమంది ఉంటే అంతమంది జర్నలిస్టులకు జనసేన పార్టీ సభ్యత్వానికి ఎంత ఖర్చు వచ్చినా తాను భరిస్తానని గొప్ప మనసును చాటుకున్నారు ఈ కార్యక్రమం ద్వారా పాత్రికేయుల సమస్యలపై జనసేన పార్టీ సానుకూలంగా స్పందించడం అభినందనీయమని పాల్గొన్న జర్నలిస్టులు అభిప్రాయపడ్డారు.
