జిల్లా స్థాయి రహదారుల భద్రత, మాదకద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశం.
ప్రమాదాల నివారణకు పటిష్ట కార్యాచరణ – మాదకద్రవ్యాల అరికట్టుకు కట్టుదిట్ట చర్యలు- జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
పయనించె సూర్యుడు ఫిబ్రవరి 19(పొనకంటి ఉపేందర్ రావు )
భద్రాది కొత్తగూడెం :జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి కట్టుదిట్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. గురువారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా స్థాయి రహదారుల భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై సమీక్ష నిర్వహించి, ప్రమాదాలకు గల కారణాలు, నివారణ చర్యలపై విస్తృతంగా చర్చించారు.జిల్లా వ్యాప్తంగా 38 బ్లాక్ స్పాట్లు, 62 ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న ప్రదేశాలను గుర్తించినట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. జాతీయ రహదారి 30లో చండ్రుగొండ మండలం తిప్పనపల్లి యూ-టర్న్ వద్ద ఐదు ప్రమాదాలు నమోదైన నేపథ్యంలో వాటి కారణాలను సమగ్రంగా పరిశీలించి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. త్రీ ఇంక్లైన్, అశ్వరావుపేట, నారావారిగూడెం, ఇల్లందు ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపం, సుజాతనగర్, చుంచుపల్లి, అశ్వాపురం, మణుగూరు, దుమ్ముగూడెం తదితర ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు.ఫిబ్రవరి నెలలో ఇప్పటివరకు 24 ప్రమాదాలు నమోదైనట్లు వెల్లడిస్తూ, వాటి కారణాలను విశ్లేషించి తక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు. మణుగూరు, ఇల్లందు, అశ్వరావుపేట, కొత్తగూడెం, భద్రాచలం ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణ కోసం ఆటోమేటిక్ ట్రాఫిక్ సిగ్నల్స్, జీబ్రా లైన్స్, సైన్ బోర్డులు, సూచికల ఏర్పాటు కోసం అవసరమైన నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.అదేవిధంగా ప్రతి నెల జిల్లాలో నమోదవుతున్న ప్రమాదాల వివరాలను పోలీస్, రవాణా మరియు వైద్యశాఖల సమన్వయంతో సేకరించి నేషనల్ హైవే ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేయాలని ఆదేశించారు.ప్రమాదాలలో మృతిచెందిన వారి వివరాల ఆధారంగా అత్యవసర వైద్యసేవలను బలోపేతం చేయాలని సూచించారు. అశ్వరావుపేట పరిధిలో అంబులెన్స్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దమ్మపేట, అల్లపల్లి, అన్నపురెడ్డిపల్లి రహదారులపై బోలార్డుల ఏర్పాటు, రోడ్డు ఇరువైపులా పిచ్చి మొక్కల తొలగింపు చేపట్టాలని సూచించారు. వర్షాకాలానికి ముందు జిల్లా వ్యాప్తంగా రహదారుల మరమ్మత్తులు పూర్తి చేయాలని, మణుగూరు ప్రధాన రహదారిపై గుంతలు పూడ్చే పనులు తక్షణం చేపట్టాలని ఆదేశించారు.ఎన్‌సిసి విద్యార్థులతో నెలలో రెండుసార్లు రహదారి భద్రతపై అవగాహన ర్యాలీలు నిర్వహించాలని, పాఠశాలలు, కళాశాలలో ఓవర్ స్పీడ్ వల్ల జరిగే ప్రమాదాలపై వీడియో ఆధారిత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. రహదారి నిర్మాణాలకు పెండింగ్‌లో ఉన్న అటవీ శాఖ అనుమతులపై నివేదిక అందించాలని ఆదేశించారు.
అనంతరం జిల్లా స్థాయి మాదకద్రవ్య నియంత్రణ కమిటీ సమావేశం నిర్వహించారు. మాదకద్రవ్యాల నియంత్రణ, అక్రమ రవాణా, సాగు, వినియోగాన్ని అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. చెక్‌పోస్టుల వద్ద అత్యాధునిక సాంకేతిక పరికరాలతో నిశిత తనిఖీలు నిర్వహించేందుకు అవసరమైన యంత్రాల ఏర్పాటుపై నివేదికలు సమర్పించాలని సూచించారు.మాదకద్రవ్యాల వినియోగదారులను గుర్తించి డి-అడిక్షన్ సెంటర్లకు తరలించి తగిన కౌన్సిలింగ్ అందించాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఏరియా ఆసుపత్రుల్లో డి-అడిక్షన్ సెంటర్ల ఏర్పాటు చర్యలు చేపట్టాలని, తొలి దశలో కొత్తగూడెం ఏరియా ఆసుపత్రిలో డి-అడిక్షన్ సెంటర్ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు.పోలీస్ శాఖ నిర్వహిస్తున్న చైతన్యం కార్యక్రమాన్ని విస్తృత స్థాయిలో చేపట్టి ప్రజలను భాగస్వామ్యం చేసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగాన్ని అరికట్టేందుకు కట్టుదిట్టమైన తనిఖీలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జడ్పీ సీఈవో నాగలక్ష్మి, సిపిఓ సంజీవరావు,ఎక్సైజ్ సూపర్డెంట్ జానయ్య, వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలత లెనినా,ఆర్ అండ్ బి ఈఈ నాగేశ్వరరావు, పంచాయతీరాజ్ శాఖ ఈఈ శ్రీనివాస్, వైద్యశాఖ అధికారి తుకారాం రాథోడ్, మిషన్ భగీరథ ఈ ఈ లు తిరుమలేష్, నళిని జిల్లా రవాణా శాఖ అధికారి, పోలీస్ శాఖ అధికారులు, అటవీశాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, నేషనల్ హైవేస్ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
