“ట్యాపింగ్ కేసులో కీలక మలుపు: మాజీ సీఎం కేసీఆర్, హరీశ్ రావుకు SIT నోటీసులు?”
పయనించే సూర్యుడు న్యూస్ : తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రి హరీశ్ రావుకు సిట్ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎవరి కోసం చేశారన్న కోణంలో సిట్ దర్యాప్తు ముమ్మరం చేస్తోంది. ప్రస్తుతం పరిణామం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ తన దూకుడు పెంపింది. ఇప్పటికే రివ్యూ కమిటీలోని వారిని సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఈకేసులో కీలకంగా వ్యవహరించిన మాజీ ఎస్ఐడీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు జీఏడీ సెక్రటరీ, సీఎస్‌లు, ఇంటెలిజెన్స్ చీఫ్‌ను మరోసారి విచారణ నిమిత్తం నోటీసులు అందించారు. అయితే ఈ సారి తెలంగాణ అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక నిర్ణయం తీసుకుంది సిట్. ఇప్పడు ఈ కేసులో రాజకీయ నేతలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా.. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావుకు సిట్ నోటీసులు ఇవ్వనుంది.అయితే ఈ కేసులో కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసే అంశం మరింత కీలకంగా మారనుంది. ఈ నెల 29న నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపత్యంలో ఈ నోటీసులు ఉత్కంఠ నెలకొల్పుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు మాజీ ఐఏఎస్‌లు, మాజీ ఐపీఎస్ అధికారులను సిట్ సాక్షులుగా విచారించింది. గతంలో ఒకసారి మాజీ సీఎస్‌లు సోమేష్ కుమార్, శాంతి కుమారిలను సిట్ విచారించింది. సాధారణ పరిపాలన శాఖ మాజీ పొలిటికల్ సెక్రటరీ రఘునందన్‌రావు, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చందర్‌ను సైతం సిట్ విచారించింది. అయితే ఇటీవల రెండోసారి విచారణకు హాజరుకావాల్సింది మాజీ సీఎస్ సోమేష్ కుమార్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చందర్‌కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఎస్ఐబీ ఓఎస్‌డీగా ప్రభాకర్ రావును నియమించడంపై ఐఏఎస్‌లను సిట్ అధికారులు ప్రశ్నించారు. వారి స్టేట్మెంట్లను రికార్డు చేసింది. అయితే తాజాగా మరోసారి నోటీసులు జారీ చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది.ఇక ఈ కేసుపై బీఆర్ఎస్‌లో చర్చలు మొదలైయ్యాయి. సిట్ నోటీసులు అందించినట్లయితే మాజీ సీఎం కేసీఆర్ చిక్కుల్లో పడినట్టే నంటూ రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఈ అంశంపై ఒకటి రెండురోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని, న్యాయ నిపుణులతో చర్చించే యోచనలో బీఆర్ఎస్ హైకమాండ్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీని అనంతరం కాళేశ్వరం కేసులో సీబీఐ రంగంలోకి దిగే అవకాశం ఉందని అంటున్నారు. ఏదిఏమైనా ఈసారి బీఆర్ఎస్ పెద్దల చుట్టూ ఉచ్చు బిగుస్తోందని చెప్పవచ్చు.