“తీవ్రమైన వర్ష సూచన! పిడుగులతో కూడిన వానలతో ఈ ప్రాంతాలు ప్రభావితమవుతాయి”
పయనించే సూర్యుడు న్యూస్ :ఏపీకి విపత్తు నిర్వహణ సంస్థ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని APSDMA వెల్లడించింది. ముఖ్యంగా కోనసీమ, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, తిరుపతి, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, అనంతపురం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పిడుగులతో కూడిన వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించింది. అలాగే మిగిలిన జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు కూడా పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద నిలబడరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు సురక్షితమైన ప్రదేశాల్లోనే ఉండాలని తగు జాగ్రత్తలు తీసుకుని అధికారుల సూచనలను పాటించాలని పేర్కొంది. ఇటు, తెలంగాణలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ఇవాళ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా యాదాద్రి భువనగిరి, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, నిజామాబాద్,హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, మహబూబ్‌నగర్, కామారెడ్డి, గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.