PS Telugu News
Epaper

తెలంగాణలో కొత్త నేషనల్ హైవేలు ప్రారంభం—కలెక్టర్ల చేతిలో కీలక బాధ్యత

📅 26 Nov 2025 ⏱️ 12:51 PM 📝 తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :తెలంగాణలో కొత్తగా నిర్మించబోయే నేషనల్ హైవేలకు భూసేకరణ పెద్ద తలనొప్పిగా మారింది. టెండర్లు పూర్తయినా.. కొన్ని చోట్ల భూములు దక్కక పనులు ఆగిపోతున్నాయి. సీఎం ఆదేశించినా, కలెక్టర్లు వేగంగా స్పందించడం లేదని తెలుస్తోంది. పరిహారం, మార్గం మార్పు, విద్యుత్ లైన్లు, అటవీ అనుమతులు వంటి సమస్యలతో ప్రాజెక్టులు ఆలస్యమై, ఖర్చు పెరిగిపోతోంది.తెలంగాణలో కొత్తగా నిర్మించనున్న, నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారుల ప్రాజెక్టులకు భూసేకరణ పెద్ద అడ్డంకిగా మారింది. ఇప్పటికే టెండర్లు పూర్తయి పనులు ప్రారంభమైనప్పటికీ.. కొన్ని ప్రాంతాలలో భూములను స్వాధీనం చేసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) పనులు చేపట్టాలంటే.. రాష్ట్ర ప్రభుత్వం మొదటగా భూసేకరణ చేసి ఆ భూములను ఎన్‌హెచ్‌ఏఐకి అప్పగించాల్సి ఉంటుంది. ఈ సమస్య ఇటీవల జరిగిన జాతీయ రహదారుల ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్షలో ప్రధాన చర్చాంశంగా మారింది.భూసేకరణలో నెలకొన్న జాప్యాన్ని దృష్టిలో ఉంచుకుని.. జిల్లాల కలెక్టర్లు ఈ సమస్యను తక్షణమే పరిష్కరించి, భూములను వేగవంతంగా అప్పగించాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ, క్షేత్రస్థాయిలో భూసేకరణ ప్రక్రియ ఆశించిన వేగంతో జరగడం లేదని తెలుస్తోంది. ఆర్మూర్‌- జగిత్యాల రహదారి, మహబూబ్‌నగర్‌- గూడెబల్లూర్‌ నేషనల్ హైవే, జగిత్యాల- కరీంనగర్‌ నేషనల్ హైవే జగిత్యాల- మంచిర్యాల రహదారికి భూసేకరణ ప్రధాన సమస్యగా మారింది. భూసేకరణతో పాటు, మరిన్ని ఇతర సమస్యలు కూడా రహదారి పనులకు అడ్డంకిగా మారి.. ప్రాజెక్టులు ఆగిపోయే ప్రమాదం ఏర్పడుతోంది. భూసేకరణపై ప్రజలు కోర్టులలో, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT)లో కేసులు వేశారు. పరిహారం, మార్గం మార్పు వంటి అంశాలపై స్థానికుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. రహదారి మార్గంలో ఉన్న విద్యుత్తు వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు వంటి వాటిని తరలించడంలో ఆలస్యం జరుగుతోంది. అటవీ ప్రాంతాలలో పనులు చేపట్టడానికి అవసరమైన అనుమతులు పొందడంలోనూ జాప్యం జరుగుతోంది.పనులు ప్రారంభమైన తర్వాత ఈ సమస్యలను పరిష్కరించడానికి అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాల్సి వస్తోంది. ఈ జాప్యం కారణంగా ప్రాజెక్టుల వ్యయం పెరగడమే కాకుండా, ప్రజలకు రహదారులు అందుబాటులోకి వచ్చే సమయం కూడా వాయిదా పడుతోంది. ఈ నేపథ్యంలో కలెక్టర్లకు కీలక బాధ్యతలు అప్పగించారు. వీలైనంత త్వరగా ఎలాంటి అడ్డంకులు లేకుండా భూసేకరణ చేపట్టాలని సర్కార్ సూచించింది. భూసేకరణ పూర్తయిన తర్వాత.. రోడ్డు నిర్మాణ పనులు వేగంగా సాగనున్నాయి.

Scroll to Top