దరువు కళా బృందం రాజతోత్సవాలకు సన్నాహాలు
పయనించే సూర్యుడు న్యూస్ ఫిబ్రవరి 22 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ ఉద్యమం మలిదశలో సాంస్కృతికంగా మిన్నంటిన నినాదం ఏదైనా ఉంటే అది ‘దరువు’ అనే పేరే. ఉద్యమ వేళల్లో వీధి వీధి తిరిగిన ఆ కళాబృందం ఇప్పుడు 25 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుని రాజతోత్సవాలకు సిద్ధమవుతోంది. మార్చి 10న హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి వేదికగా జరిగే ‘దరువు జాతర’ను విజయవంతం చేయాలని ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.ఈ జాతర సంబరాలకు సంబంధించిన గోడపత్రికను సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఆవిష్కరించారు. కార్యక్రమం సందర్బంగా పలువురు నాయకులు దరువు చరిత్రను, తెలంగాణ ఉద్యమంలో దాని పాత్రను స్మరించుకున్నారు.“తెలంగాణ ఉద్యమానికే అగ్రభాగం దరువు” – విమలక్కప్రజాగాయని, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జాతీయ అధ్యక్షురాలు విమలక్క మాట్లాడుతూ, దరువు సంస్థ నుంచి వెలువడిన పాటలు తెలంగాణ అంతటా ఉద్యమ స్పూర్తిని రగిలించాయని అన్నారు. “వీరులారా వందనం” వంటి గీతాలు కండంతరాలు దాటి ప్రతీ ధూంధాం సభలో మారుమోగాయని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమానికే దరువు అగ్రభాగంగా నిలిచిందని, మార్చి 10 జాతర తెలంగాణ సాంస్కృతిక సంబరాలకు ప్రతీకగా మారాలని ఆకాంక్షించారు.“ప్రజాకళలకు ప్రాణం పోసింది దరువు” – పాశం యాదగిరిసీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి మాట్లాడుతూ, ప్రజా కళారూపాలకు ప్రాణం పోసిన సంస్థ దరువేనని అభిప్రాయపడ్డారు. దరువు అంజన్న, దరువు ఎల్లన్నల వంటి నాయకులు ఒస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఎన్నో ఉద్యమాలు నడిపారని, వారి త్యాగం వెలకట్టలేనిదని కొనియాడారు.“విద్యార్థి ఉద్యమానికి దరువు తోడ్పాటు అపారం” – పృథ్వీరాజ్ యాదవ్తెలంగాణ క్రాంతి దళ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్ మాట్లాడుతూ, తెలంగాణ సాధన విద్యార్థుల త్యాగంతోనే సాధ్యమైందని చెప్పారు. ఆ విద్యార్థి ఉద్యమంలో దరువు కళాబృందం చురుకైన పాత్ర పోషించిందని, తాను కూడా ఆ పోరాటంలో భాగం కావడం గర్వంగా భావిస్తున్నానని అన్నారు.“పుస్తకాలు పక్కనపెట్టి ఉద్యమ కవడి మోసింది విద్యార్థులే” – దరువు ఎల్లన్నదరువు కళాబృందం వ్యవస్థాపక అధ్యక్షులు దరువు ఎల్లన్న మాట్లాడుతూ, రాజకీయ పార్టీలు వెనుకంజ వేసిన వేళల్లో విద్యార్థులే ఉద్యమాన్ని భుజాన మోసారని స్పష్టం చేశారు. ఆ విద్యార్థి జేఏసీకి సాంస్కృతిక బలం ఇచ్చింది దరువేనని, ఉద్యమ రోజుల్లో సమాఖ్య వాదులకు చెమటలు పట్టించిన ఘనత ఒస్మానియా యూనివర్సిటీ ఉద్యమానిదేనని గుర్తుచేశారు.మార్చి 10న జరిగే రాజతోత్సవాలను కన్నుల పండుగగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉద్యమకారులు, కళాకారులు, ప్రజా సంఘాలు పెద్దఎత్తున హాజరై జాతరను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ప్రముఖుల హాజరుదరువు అంజన్న వివరాల ప్రకారం, ఈ వేడుకలకు సంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు పలు ప్రభుత్వ పెద్దలు హాజరుకానున్నారు. రోజు పొడవునా తెలంగాణ ఉద్యమ పాటలు, సామాజిక గేయాలు, వివిధ కళారూపాల ప్రదర్శనలు నిర్వహించనున్నారు.కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గం భాస్కర్, రాష్ట్ర ఓబీసీ కన్వీనర్ కేతురు వెంకటేష్, ఎంపీడీఓ దమ్మని రాము, వాగ్గేయకారుడు వరంగల్ రవి, ధూమ్ ధామ్ వ్యవస్థాపకుడు అంతడుపుల నాగరాజు, కొండపాక విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.తెలంగాణ ఉద్యమ చరిత్రను వెనక్కి తిప్పి చూస్తే, రాజకీయ వేదికలకంటే ముందే సాంస్కృతిక వేదికలపై అగ్గిపెట్టెలా రగిలిన శబ్దం ‘దరువు’దే. ఆ గళం మళ్లీ ఒకసారి రవీంద్రభారతి వేదికపై మారుమోగబోతోంది. మార్చి 10 జాతర కేవలం వార్షికోత్సవం కాదు… అది ఒక ఉద్యమ జ్ఞాపకోత్సవం.

