నాగారం వైన్స్ వివాదంపై హైకోర్టు ఆగ్రహం నీకు ఒక న్యాయం… నీ పిల్లలకు ఒక న్యాయం… సమాజానికి మరో న్యాయమా జడ్జి కఠిన వ్యాఖ్యలు
పయనించే సూర్యుడు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర మండల్ నాగారం నవంబర్ 26నాగారం
మున్సిపాలిటీ పరిధిలో పాత, కొత్త వైన్ షాపుల మధ్య నెలకొన్న వివాదం హైకోర్టు దాకా చేరింది. నూతనంగా అనుమతి పొందిన వైన్‌షాప్‌పై మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి కేసు వేయగా, పాత కనకదుర్గ వైన్స్ పై జీవన్ రెడ్డిలు వేరు పిటిషన్ దాఖలు చేశారు. పరస్పరం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కోర్టు ద్వారానే పరిష్కారం కోరడంతో బుధవారం హైకోర్టులో విచారణ వేడెక్కింది.వాదనలు విన్న అనంతరం హైకోర్టు న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వ్యక్తిగత ప్రయోజనాలు, వ్యాపార పోటీలు, రాజకీయ ప్రయోజనాల కోసం కోర్టులను వేదికగా చేసుకోవద్దని జడ్జి హెచ్చరించారు. ఈ సందర్భంగా“నీకు ఒక న్యాయము… నీ పిల్లలకు ఒక న్యాయము… వారి పిల్లలకు ఒక న్యాయము… సమాజానికి ఒక న్యాయమా?”అని కఠిన వ్యాఖ్యలు చేశారు.కోర్టు స్పష్టం చేస్తూ, ప్రజా ప్రయోజనాలతో సంబంధం లేని వ్యక్తిగత వ్యాపార వివాదాలు కోర్టుల సమయాన్ని వృథా చేస్తున్నాయని పేర్కొంది. వైన్స్ అనుమతులు మంజూరు ప్రక్రియలో ఎక్కడైనా అక్రమాలు జరిగాయా అన్న దానిపై కూడా కోర్టు ప్రశ్నలు లేవనెత్తింది.తదనంతరం, నూతనంగా ప్రారంభమైన వైన్ షాప్‌తో పాటు పాత కనకదుర్గ వైన్స్ కు కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసి, సంబంధిత అధికారుల వివరణ కోరింది. మున్సిపాలిటీ, ఎక్సైజ్ శాఖల నుండి కూడా సమగ్ర నివేదికలను సమర్పించాలని ఆదేశించింది.ఈ విచారణతో నాగారం వైన్స్‌పై జరుగుతున్న వివాదం మరో మలుపు తిరిగింది. తదుపరి విచారణ తేదీని కోర్టు త్వరలో ప్రకటించనుంది.