పరిగి రోడ్డుకు ప్రగతి కాంతులు..
విస్తరణ, ఫ్లడ్ లైట్ల ఏర్పాటుకు రూ.5.50 కోట్లు..
షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రకటన
( పయనించే సూర్యుడు ఆగస్టు 26 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
షాద్ నగర్ పట్టణంలోని పరిగి రోడ్డును అభివృద్ధి చేసేందుకు రూ.5.50 కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రకటించారు. మంగళవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టణ కూడలి నుంచి కిషన్ నగర్ రోడ్డు వరకు ఉన్న రహదారి బాగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో వాహనాల రద్దీ పెరిగి ఇరకాటంగా మారిందని, అదేవిధంగా లీకేజీలతో, భారీ వాహనాలతో గుంతలు పడి అత్యంత అధ్వానంగా తయారైందని అన్నారు. దీనిని బాగు చేసే నిమిత్తం రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ నిధులను మంజూరు చేసినట్లు వివరించారు. త్వరలోనే రహదారి పనులను ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. అదేవిధంగా షాద్ నగర్ పట్టణంలోని ప్రధాన రహదారి విస్తరణకు కూడా వ్యాపారంతో మాట్లాడుతున్నామని అది కూడా త్వరలోనే తేలుస్తామని వెల్లడించారు. పరిగి రోడ్డును పునరుద్ధరించడంతోపాటు మధ్యలో అడుగడుగున ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కాశీనాథ్ రెడ్డి సమావేశంలో పాల్గొన్నారు..
