ప్రజలకు సురక్షితమైన రవాణా వ్యవస్థను అందించడమే ప్రభుత్వ లక్ష్యం

July 13, 2026 | సినిమా వార్తలు

మక్తల్ సభలో రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

మక్తల్ నియోజక వర్గంలో రూ. 573.28 కోట్లతో హ్యామ్ రోడ్ల నిర్మాణ పనులకు జిల్లా మంత్రులు జూపల్లి, వాకిటి శ్రీహరి తో కలిసి శంకుస్థాపన చేసిన కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.

రాష్ట్ర ప్రజలకు సురక్షితమైన రవాణా వ్యవస్థను అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర రోడ్లు,భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు.

పయనించే సూర్యుడు జులై 14/ మక్తల్:సోమవారం మక్తల్ నియోజకవర్గంలో హ్యామ్ రోడ్ల శంకుస్థాపన కార్యక్రమం కోసం విచ్చేసిన రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లకు రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు & క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్‌, జిల్లా కలెక్టర్ ప్రియాంక, ఎస్పీ డాక్టర్ వినీత్ తో పాటు ప్రజాప్రతినిధులు కలిసి రూ.237 కోట్లతో నిర్మించనున్న మక్తల్–నారాయణపేట నాలుగు లైన్ల హ్యామ్ రోడ్డుకు శంకుస్థాపన చేసి, హ్యామ్ రోడ్ల పైలాన్‌ను మంత్రి కోమటి రెడ్డి. వెంకట్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ… మక్తల్ నియోజకవర్గంలో రూ.573.28 కోట్లతో హ్యామ్ రోడ్ల నిర్మాణ పనులకు నేడు శంకుస్థాపన చేశాం. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మంత్రి కాక ముందు నుంచే ప్రతి సమావేశంలో మక్తల్–నారాయణపేట రహదారి గురించి ప్రస్తావిస్తూ, ఈ రోడ్డు నిర్మాణాన్ని మంజూరు చేయాలని నిరంతరం కోరేవారని, ఆ విజ్ఞప్తికి అనుగుణంగానే ఈ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టిందని ఆయన తెలిపారు. గతంలో తాను ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రిగా ఉన్నానని, ఇక్కడి రహదారుల పరిస్థితిపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉందనీ, గత ప్రభుత్వ హయాంలో పంచాయతీరాజ్, రవాణా, ఆర్‌అండ్‌బీ శాఖల్లో చేపట్టిన పనులకు సుమారు రూ.40 వేల కోట్ల బకాయిలు మిగిల్చడంతో పాటు రూ.8 లక్షల కోట్లకు పైగా అప్పుల భారం రాష్ట్రంపై మోపారని ద్వజమెత్తారు.పదేళ్లపాటు రోడ్లను సరిగా అభివృద్ధి చేయకుండా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని ఆయన విమర్శించారు.ఈ రోజు శంకుస్థాపన చేసిన మక్తల్–నారాయణపేట రహదారిని 12 నుంచి 16 నెలల్లో పూర్తి చేసి, ప్రజలు కేవలం 20 నిమిషాల్లో నారాయణపేటకు చేరుకునేలా నిర్మిస్తామని తెలిపారు. రహదారి విస్తరణకు ప్రజలు సహకరించి అవసరమైన భూమిని ఇవ్వాలని, భూములు ఇచ్చే వారికి ప్రభుత్వం న్యాయమైన పరిహారం అందిస్తుందనీ, రహదారి నిర్మాణం విషయంలో అవసరమైన పరిపాలన అనుమతులన్నింటినీ తొందరగా మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక ను మంత్రి ఆదేశించారు.మంచి రహదారులు ఉంటేనే పరిశ్రమలు వస్తాయనీ, వ్యాపారాలు పెరుగుతాయని, యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, అభివృద్ధికి నాణ్యమైన రోడ్లే పునాది అని మంత్రి పేర్కొన్నారు.గత ప్రభుత్వ కాలం నాటి బిల్లుల కోసం ఇప్పటికీ కాంట్రాక్టర్లు తిరుగుతున్నా, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం రూ.20 వేల కోట్లతో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందనీ, అన్నింటికి కలిపి ఏడాదికి 50 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.
గత పదేళ్లలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వని పరిస్థితి ఉండగా, తమ ప్రభుత్వం రేషన్ కార్డుల జారీ, సన్నబియ్యం పంపిణీతో పాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం అని చెప్పారు.తాము ప్రచారం కంటే పనులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాం అని మంత్రి స్పష్టం చేశారు. సభలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ఒక్క ప్యాకేజీలో రూ. 547 కోట్లు అందులో 4 లైన్ల రోడ్డు నిర్మాణం అంటే ఆషామాషీ కాదు అని అన్నారు. రోడ్డు వ్యవస్థ ఉంటేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి పట్టుదల, ఏమన్నా చేయాలన్న తపన ఉన్న నాయకుడు అని కొనియాడారు. సాగునీటి పరంగా మక్తల్ మంచి పురోగతి సాధిస్తుందని, వచ్చే ఎన్నికల నాటికి సాగునీటి వనరులు ఇక్కడ గణనీయంగా పెరుగుతాయని జూపల్లి తెలిపారు. ఈ రెండున్నర సంవత్సరాల కాలంలోనే 30వేల కోట్ల తో ఇందిరమ్మ ఇండ్లను నిర్మింప చేస్తున్నామన్నారు. ఇటీవల రోజు 1000 కోట్లు రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. ప్రతీ నియోజక వర్గంలో 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను నిర్మింప చేస్తున్నామని మంత్రి తెలిపారు. వాకిటి శ్రీహరి నేతృత్వంలో మక్తల్ నియోజక వర్గ రూపురేఖలు మారుతాయని మంత్రి జూపల్లి పేర్కొన్నారు.సభకు అధ్యక్షత వహించిన మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి మాట్లాడుతూ… మక్తల్ నియోజకవర్గంలో ఈరోజు ప్రారంభమైన రోడ్ల నిర్మాణ పనులు చారిత్రాత్మకమైనవని అన్నారు. ప్రజాప్రభుత్వం ప్రజల అవసరాలనే ప్రాధాన్యంగా తీసుకొని ఈ భారీ రహదారి ప్రాజెక్టులను మంజూరు చేసిందని తెలిపారు. మక్తల్ నుంచి నారాయణపేట వరకు రహదారి నిర్మాణం ఎన్నో ఏళ్లుగా అగ్నిపరీక్షగా మారిందన్నారు. దాదాపు పది మంది జిల్లా పాలన అధికారులు, పలువురు ఎమ్మెల్యేలు మారినా ఈ రోడ్డు మంజూరు కాలేదని గుర్తు చేశారు. గత ప్రభుత్వం అభివృద్ధి పేరుతో గొప్పలు చెప్పిందని, కానీ నాణ్యమైన రహదారుల నిర్మాణంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. పదేళ్ల పాటు మాటలు, ప్రచార ఆర్భాటాలు, రంగురంగుల హామీలతో ప్రజలను మోసం చేశారన్నారు. నిర్మించిన రహదారులు కూడా నాసిరకంగా ఉండటంతో వందలాది గుంతలు ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు.ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజల రవాణా కష్టాలు తొలగించాలనే సంకల్పంతో రూ.237 కోట్లతో మక్తల్–నారాయణపేట నాలుగు లైన్ల రహదారిని ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు.మక్తల్ నియోజకవర్గానికి ఏ అభివృద్ధి పని కోరినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సంబంధిత మంత్రులు వెంటనే సానుకూలంగా స్పందిస్తూ నిధులు మంజూరు చేస్తున్నారని, ఇందుకు ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా వెనుకబడిన మక్తల్ నియోజకవర్గం ఇప్పుడు అభివృద్ధి బాటలో దూసుకుపోతోందని, ప్రజలు స్వేచ్ఛగా, గౌరవంగా జీవించే పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. మక్తల్ అభివృద్ధి ప్రయాణానికి ప్రజల ఆశీర్వాదం, సహకారం ఎల్లప్పుడూ ఉండాలని మంత్రి వాకిటి శ్రీహరి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మక్తల్ మున్సిపల్ చైర్ పర్సన్ వాకిటి మానస, మార్కెట్ చైర్మన్ లు రాధా లక్మారెడ్డి, సదా శివా రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ వార్ల విజయ్ కుమార్, ఆర్ అండ్ బీ సీ . ఈ .వెంకటేశ్వర్ రావు, ఎస్.ఈ రాజేందర్, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper