ప్రపంచకప్ తర్వాత సౌతాఫ్రికా కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు – “అదే మా ఓటమికి కారణం!”
పయనించే సూర్యుడు న్యూస్ :భారత జట్టు మహిళల వన్డే ప్రపంచకప్ 2025 విజేతగా నిలిచింది. ఆదివారం నవీ ముంబై వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. టీమ్ఇండియా బ్యాటర్లలో షెఫాలి వర్మ (87; 78 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు), దీప్తి శర్మ (58; 58 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలు చేశారు. స్మృతి మంధాన (45; 58 బంతుల్లో 8 ఫోర్లు), రిచా ఘోష్ (34; 24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో అయబొంగా ఖాకా మూడు వికెట్లు తీసింది. ఆ తరువాత 299 పరుగుల లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్ (Laura Wolvaardt) ఒంటరి పోరాటం చేసింది. 98 బంతులు ఎదుర్కొన్న ఆమె 11 ఫోర్లు, 1 సాయంతో సెంచరీ (101) సాధించింది. మిగిలిన ప్లేయర్లు రాణించకపోవడంతో 45.3 ఓవర్లలో దక్షిణాఫ్రికా 246 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ ఐదు వికెట్లతో తీసింది. షెఫాలీ వర్మ రెండు వికెట్లు పడగొట్టింది. శ్రీ చరణి ఓ వికెట్ సాధించింది.
అదే మా కొంపముంచింది.. ఇక ఈ మ్యాచ్‌లో ఓటమిపై దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ స్పందించింది. ఆఖరిలో వరుసగా వికెట్లు కోల్పోవడంతోనే ఓటమి పాలు అయ్యామని చెప్పుకొచ్చింది. మొత్తంగా బ్యాటింగ్ వైఫల్యమే తప కొంప ముంచిందని అంది. ఇక ఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికి కూడా ఈ టోర్నీ అసాంతం తాము మెరుగైన ప్రదర్శన చేశామని అంది. అందుకు గర్వంగా ఉన్నట్లు తెలిపింది. ఇక ఫైనల్ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుంటామంది. పిచ్ నుంచి స్వింగ్ లభిస్తుందని ఆశించామని, అందుకునే టాస్ గెలిచిన తరువాత బౌలింగ్ తీసుకున్నట్లుగా తెలిపింది. ఈ నిర్ణయం పై తనకు ఎలాంటి చింత లేదంది. లక్ష్య ఛేదనలో ఓ దశలో విజయం దిశగా వెళ్లినప్పటికి కూడా ఆఖరిలో వరుసగా వికెట్లు కోల్పోవడంతోనే ఓడిపోయామంది.తాను స్కోరు బోర్డును పదే పదే చూస్తూ ఆడానంది. ఇక భారత జట్టు కూడా 350 పరుగులు చేసేలా కనిపించిందని, అయితే ఆఖరిలో తమ బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారంది. షెషాలీ వర్మ చాలా బాగా బ్యాటింగ్ చేసిందని, ఆమె తన దూకుడైన ఆటతీరుతో ప్రత్యర్థి బౌలర్లను దెబ్బతీస్తుందని తెలిపింది. వాస్తవానికి సీనియర్ ప్లేయర్ మారిజానే కాప్ కోసమైనా ఈ కప్పును గెలవాలని భావించామని, అయితే.. సాధ్యం కాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఆమెకు ఇదే చివరి ప్రపంచకప్ అనే విషయం తెలిసి చాలా బాధగా ఉందంది. ఆమె ఇద్దరు ప్లేయర్లకు సమానం అని, అలాంటి ప్లేయర్ జట్టులో ఉండడం తమ అదృష్టం అని చెప్పుకొచ్చింది.