ప్రభుత్వ విద్య అందరికా..? లేక టాపర్లకే పరిమితమా?
పయనించే సూర్యుడు జూలై 29 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు )తిరుపతి జిల్లాదొరవారిసత్రం మండలంలోని గురుకుల ప్రభుత్వ బాలురు జూనియర్ కళాశాల/హాస్టల్‌లో ఇంటర్ ప్రవేశాలపై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. 450 నుంచి 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు మాత్రమే సీట్లు కేటాయిస్తున్నారని, తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులను వెనక్కి పంపుతున్నారనే వాదనలు తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ విద్యాసంస్థలు పేద, మధ్యతరగతి విద్యార్థులకు అండగా నిలవాల్సిన సమయంలో, మార్కుల పేరుతో ప్రవేశాలు నిరాకరిస్తే వారి భవిష్యత్తు ఏమిటి ని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ప్రైవేట్ కళాశాలల్లో భారీ ఫీజులు చెల్లించే స్థోమత లేని కుటుంబాల పిల్లలు చివరకు చదువుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వ విద్య అందరికీ అందుబాటులో ఉండాలా, లేక ఎక్కువ మార్కులు సాధించిన వారికే పరిమితమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఆరోపణల్లో నిజానిజాలు ఏమిటో జిల్లా విద్యాశాఖ అధికారులు వెంటనే పరిశీలించి ప్రజలకు స్పష్టత ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు. ప్రవేశాల ప్రక్రియలో పారదర్శకత పాటించి, అర్హులైన ప్రతి విద్యార్థికి నిబంధనల మేరకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. పేద విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకుండా అధికారులు తక్షణమే స్పందించి అవసరమైన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.