PS Telugu News
Epaper

బెంగళూరు రాజకీయాల్లో వేడి పెరగింది — రాహుల్ సంకేతాలతో కుర్చీలాట కొత్త దశకు

📅 28 Nov 2025 ⏱️ 11:15 AM 📝 జాతీయ-వార్తలు
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :కర్నాటక కాంగ్రెస్‌ ఎపిసోడ్‌లో ట్విస్టులే ట్విస్టులు. తెరవెనుక ఏం జరుగుతోందో ఎవరికీ అంతుపట్టటం లేదు. అత్యుత్సాహం వద్దని అధిష్ఠానం చెప్పటంతో.. పొడిపొడి మాటలు, వ్యూహాలతో తమ మనసులో ఏముందో హైకమాండ్‌కి అర్ధమయ్యేలా తమతమ స్టయిల్‌లో మెసేజ్‌ ఇస్తున్నారు కీలక నేతలు. డీకే, సిద్దరామయ్యతో పాటు ముఖ్యనేతలను పిలుస్తాం. కూర్చోబెట్టి మాట్లాడతాం. కర్నాటక నేతలకు ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే ఇచ్చిన మెసేజ్‌ ఇది. హైకమాండ్‌ పిలుపు ఎప్పుడొస్తుందోనని సీఎం, డిప్యూటీసీఎం ఇద్దరూ వెయిటింగ్‌. కబురు వచ్చేదాకా వేచిచూడలేమన్నట్లు ఆ ఇద్దరి మద్దతుదారులు తమదైన మెసేజ్‌లు ఇస్తున్నారు. అవసరమైతే బలప్రదర్శనకు సిద్ధమవుతున్నారు.హైకమాండ్‌ మాట్లాడి మ్యాటర్‌ సెటిల్‌ చేస్తుందని ఖర్గే అంటున్నారు. కానీ అగ్రనేత రాహుల్‌గాంధీ విదేశాల్లో ఉన్నారు. ఆయనొచ్చేదాకా ఆగుతారా.. ఈలోపే కర్నాటక పంచాయితీని కొలిక్కితెస్తారా అన్నది అసలు పాయింట్‌. దేశంలో లేరనే కానీ.. అక్కడినుంచే రాహుల్ మెసేజ్‌ ఇస్తున్నారు. నాయకత్వమార్పుపై కర్ణాటక నేతలు హైకమాండ్‌తో మాట్లాడే ప్రయత్నం చేస్తున్న సమయంలో.. రాహుల్‌ జోక్యం చేసుకున్నారు. వెయిట్.. ఐ విల్ కాల్ యు అంటూ డీకే శివకుమార్‌కి రాహుల్ మెసేజ్‌ పెట్టారు. విదేశాల్లో ఉన్న రాహుల్‌ ఎవరి ఫోన్‌ లిఫ్ట్‌ చేయటం లేదు. సిగ్నల్‌లో కేవలం మెసేజింగ్‌ మాత్రమే వాడుతురు. రాహుల్‌ అప్పాయింట్‌మెంట్‌ కోసం ఫోన్‌లో మాట్లాడేందుకు పలుమార్లు డీకే ప్రయత్నించారు. కానీ ఫోన్‌ లిఫ్ట్‌ చేయని రాహుల్‌ కర్ణాటక వ్యవహారంలో ఓ మెసేజ్‌తోనే సరిపెట్టారు. కాంగ్రెస్‌ ముఖ్య నాయకులు అందరికీ కేవలం సిగ్నల్ యాప్‌లోనే టచ్‌లో ఉన్నారు. ఫోన్‌చేసిన డీకేకు కూడా సిగ్నల్ యాప్‌లోనే వెయిట్‌ అంటూ మెసేజ్ ఇచ్చారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే పవర్‌షేరింగ్‌పై ఓ ఒప్పందం కుదిరింది. నాలుగ్గోడల మధ్య ముఖ్యనేతల సమక్షంలో జరిగిన చర్చ గురించి తాను బయటికి చెప్పలేనని డీకే అంటున్నారు. రెండున్నరేళ్లు కావటంతో అధికారబదిలీకి తన వర్గాన్ని రంగంలోకి దించి ఇక ఆగేది లేదని హైకమాండ్‌కి మెసేజ్‌ ఇచ్చారు. వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమని బయటికి డైలాగులు చెబుతున్నా.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే అసలైన బలమనే ట్వీట్‌తో మరో మెసేజ్‌ పంపారు. అధిష్ఠానంపై ఒత్తిడి పెంచేందుకే ఈ సంకేతం ఇచ్చారంటున్నా.. ఆ పోస్టు తాను పెట్టలేదని డీకే చెబుతున్నారు.మాట అనే శక్తి అంటే ప్రపంచశక్తి అని డీకే శివకుమార్‌ పేరుతో పోస్ట్‌ వస్తే.. దానికి కౌంటర్‌ అన్నట్లు సిద్దరామయ్య మరో సంచలన ట్వీట్‌ చేశారు. ఒక మాట ప్రపంచానికి, ప్రజలకు ప్రయోజనం చేకూర్చకపోతే అది శక్తి కాదు అంటూ రియాక్టయ్యారు. తేడావస్తే దబిడిదిబిడేనని పరోక్షంగా సీఎం మెసేజ్‌ ఇస్తున్నారు. ఐదేళ్లూ కొనసాగుతానంటూనే.. తప్పుకోవాల్సి వస్తే ప్లాన్‌బిని రెడీ చేసుకుంటున్నారు. నాన్న పొలిటికల్‌ కెరీర్‌ ఎండింగ్‌లో ఉందని ఆ మధ్య సంచలన కామెంట్స్‌ చేసిన సిద్దరామయ్య తనయుడు.. పూర్తికాలం ఆయనే ఉంటారంటూ కొత్త మెసేజ్‌ ఇస్తున్నారు. డీకే, సిద్దరామయ్య మధ్య కుర్చీలాట నడుస్తుంటే.. మధ్యేమార్గంగా రేసులో మేమున్నామని పార్టీ పెద్దలకు మెసేజ్‌ వెళ్లేలా చేస్తున్నారు సీనియర్‌ మంత్రులు. నాయకత్వ మార్పు మీ ఇంటిగొడవ కాదంటూ మధ్యలో మఠాధిపతులు ఎంట్రీ ఇస్తున్నారు. కర్ణాటకలో రాజకీయ సంక్షోభం తలెత్తినప్పుడల్లా.. వివిధ మఠాల స్వామీజీలు జోక్యం చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు కూడా అదే మెసేజ్ ఇస్తూ.. కర్ణాటక రాజకీయాన్ని రసవత్తరంగా మార్చేస్తున్నారు.

Scroll to Top