భార్య, పిల్లలపై కిరాతకుడి 18 ఏళ్ల వేధింపుల దృశ్యం బయటపడ్డ ఘోరం
పయనించే సూర్యుడు న్యూస్ :ఆధునిక సమాజంలోనూ మత నియమాల పేరుతో కొంతమంది దారుణాలకు ఒడిగడుతున్నారు. బుర్ఖా ధరించలేదనే కోపంతో ఓ వ్యక్తి తన భార్యను, అడ్డువచ్చిన ఇద్దరు మైనర్ కుమార్తెలను అతి కిరాతకంగా చంపి, ఇంటి ప్రాంగణంలోనే పాతిపెట్టిన ఘటన కలకలం రేపింది. ఈ హృదయవిదారక ఘటన ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాలో వెలుగుచూసింది. వంటవాడిగా పనిచేసే ఫరూఖ్ అనే వ్యక్తికి అత్యంత ఛాందసభావాలు ఉన్నాయి. తన భార్య తాహిరా ఎప్పుడూ బుర్ఖా ధరించాలని అతను వేధించేవాడు. కేవలం ఫోటో కనిపిస్తుందనే కారణంతో గత 18 ఏళ్లుగా ఆమెను ఆధార్ కార్డు, రేషన్ కార్డు వంటి కనీస గుర్తింపు పత్రాలు కూడా తీసుకోనివ్వలేదు. తన మామ ఇంటికి వచ్చినా కూడా భార్యను కలవనిచ్చేవాడు కాదు.భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. అయితే, నెల క్రితం తాహిరా బుర్ఖా ధరించకుండా తన పుట్టింటికి వెళ్లిందని ఫరూఖ్ తెలుసుకున్నాడు. ఇది తన గౌరవానికి భంగమని భావించిన అతను, డిసెంబర్ 10వ తేదీ అర్ధరాత్రి వంటగదిలో ఉన్న తాహిరాను పిస్టల్‌తో కాల్చి చంపాడు. తుపాకీ శబ్దం విని నిద్రలేచిన పెద్ద కుమార్తె అఫ్రీన్ వంటగదిలోకి రావడంతో సాక్ష్యం లేకుండా చేసేందుకు ఆమెను కూడా కాల్చి చంపాడు. మరో కుమార్తె సెహ్రీన్ కూడా అక్కడికి రావడంతో ఆమె గొంతు కోసి హతమార్చాడు. అనంతరం ఇంటి ప్రాంగణంలో టాయిలెట్ కోసం తవ్విన 9 అడుగుల గోతిలో ముగ్గురి మృతదేహాలను పాతిపెట్టి, ఎవరికీ అనుమానం రాకుండా దానిపై ఇటుకల నేలను నిర్మించాడు.తాహిరా, పిల్లలు ఆరు రోజులుగా కనిపించకపోవడంతో ఫరూఖ్ తండ్రి దావూద్‌కు అనుమానం వచ్చింది. వారి గురించి అడిగినప్పుడల్లా ఫరూఖ్ సమాధానం దాటవేసేవాడు. చివరకు తన కుమారుడే ఏదో చేసి ఉంటాడని అనుమానించిన దావూద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఫరూఖ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా ఈ ఘోర నేరాన్ని అంగీకరించాడు.నిందితుడి ఒప్పుకోలుతో పోలీసులు హత్యకు ఉపయోగించిన పిస్టల్, ఏడు ఖాళీ గుండ్లు మరియు 10 లైవ్ కార్ట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల కస్టడీలో ఉన్నాడు. భార్యను, పసిబిడ్డలను అతి దారుణంగా పొట్టనబెట్టుకున్న ఈ కిరాతకుడి ఉదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.