మక్తల్ 6 వ వార్డు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల
{పయనించే సూర్యుడు} {ఏప్రిల్ 3మక్తల్ }
నారాయణపేట జిల్లాలోని మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని 6 వ వార్డు ఉప ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ను జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. గత ఫిబ్రవరి 11 న రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఎన్నికల సంఘం ఎన్నికలను నిర్వహించింది. అయితే మక్తల్ మున్సిపాలిటీలోని 16 వార్డుల ఎన్నికల నిర్వహణకు జిల్లా ఎన్నికల అధికారి అన్ని ఏర్పాట్లు చేయగా పోలింగ్ కంటే ముందు మక్తల్ పట్టణంలోని 6 వ వార్డుకు నామినేషన్ వేసిన బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడంతో ఫిబ్రవరి 11 న. మక్తల్ మున్సిపాల్టీలోని 15 వార్డులకు మాత్రమే పోలింగ్ జరిగింది. 6వ వార్డు పోలింగ్ బిజెపి అభ్యర్థి మృతితో రద్దు అయింది. తాజాగా మక్తల్ పట్టణంలోని 6వ వార్డు కౌన్సిలర్ ఎన్నిక కు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయడంతో గురువారం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్ ఉప ఎన్నిక షెడ్యూల్ వివరాలను వెల్లడించారు. ఈ నెల 2 నుంచి 6 వరకు బీజేపీ అభ్యర్థి నామినేషన్ స్వీకరించడం జరుగుతుందని, 7న నామినేషన్ పరిశీలన, 8 న అప్పీలు కు అవకాశం ఉంటుందని, 9న నిర్ణయం ప్రకటించడం జరుగుతుందని, ఈ నెల 10 మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉప సంహరణకు గడువు ఉందని మక్తల్ మున్సిపాలిటీ ఎన్నికల అధికారి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫణింద్రా రెడ్డి వెల్లడించారు. ఈ నెల 18 పోలింగ్, 20 న ఓట్ల లెక్కింపు అదే రోజు ఫలితం వెల్లడించడం జరుగుతుందనీ ఆయన తెలిపారు. ఏమైనా అనుకోని కారణాల తో 18న పోలింగ్ జరగక పోతే 19 న పోలింగ్, 20 న కౌంటింగ్ ఉంటుందని ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. కాగా గురువారం నుంచి పోలింగ్ జరిగే వరకు (ఈ నెల 20 వరకు ) మక్తల్ పట్టణంలో ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని ఎన్నికల అధికారి ప్రకటించారు.