మరణంలోనూ విడిపోని బంధం: రోడ్డు ప్రమాదంలో తల్లి-కొడుకు మృతి
పయనించే సూర్యుడు న్యూస్ :డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి కొడుకు మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఓ తల్లి కుమారుడి అనారోగ్యానికి గురికావడంతో మెరుగైన చికిత్స కోసం తమ బంధువులతో కలిసి వైజాగ్‌కు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వెలుచూరు గ్రామానికి చెందిన తోర్లపాటి తులసి (40)కి సంజయ్, శశికుమార్ (24) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత కొన్ని రోజుల నుంచి శశికుమార్ క్యాన్సర్ వ్యాధితో భాదపడుతున్నాడు. కొడుకు భాదను చూడలేక తల్లి తులసి వైజాగ్ తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. మంగళవారం తల్లితో పాటు ఇద్దరు కుమారులు, బంధువులు తోర్లపాటి పాపారావు, నాగబత్తుల శ్రీను కారులో వైజాగ్‌కు బయల్దేరారు. ఈరోజు వెకువజామున నాలుగున్నర సమయంలో గండేపల్లి శివారులో ముందు వెళ్తున్న ట్రాలీని కారు ఢీకొన్నది. ఈ ప్రమాదంలో తులసి స్పాట్‌లోనే మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిని రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శశికుమార్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లీ కొడుకు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.