మర్డర్ కేసు విచారణలో షాక్ – నెల్లూరు జాన కామాక్షి భయంకర అరాచకాలు బయటపడ్డాయి!
పయనించే సూర్యుడు న్యూస్ :నెల్లూరులో సంచలనం సృష్టించిన హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హౌసింగ్ బోర్డ్ కాలనీలో సీపీఎం నాయకుడు పెంచలయ్య అనే వ్యక్తిని దాదాపు పదిమంది కత్తులతో నరికి చంపారు. ఆ సమయంలో ఇది రెండు వర్గాల మధ్య జరిగిన వివాదాల కారణంగా పాత కక్షలతో జరిగిన హత్య అని అందరూ అనుకున్నారు. ఆ తర్వాతే ఒక్కొక్క విషయం బయటపడుతూ షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. నెల్లూరులో అప్పటిదాకా ఎవరూ ఊహించని ఓ మహిళ నెలకొల్పిన నేర సామ్రాజ్యం తాలూకు వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.నెల్లూరు జిల్లాలో గత కొద్ది రోజులుగా నేర ప్రవృత్తి పెరిగిపోతోంది. అది కూడా మహిళలు నెలకొల్పిన నేర సామ్రాజ్యాలు బయటపడుతున్నాయి. తరచూ ప్రజలు ఉలిక్కిపడే ఘటనలు జరుగుతున్నాయి. కొద్దిరోజుల క్రితం నెల్లూరు జిల్లాలో రౌడీ షీటర్ శ్రీకాంత్ అతని ప్రియురాలు నిడగుంట అరుణ వ్యవహారం మరిచిపోకముందే, మరో లేడీ డాన్ వ్యవహారం బయటకు వచ్చింది. ఐదు రోజుల క్రితం జరిగిన పెంచలయ్య హత్య కేసులో కూపీ లాగిన పోలీసులకు అరవ కామాక్షి అనే మహిళ ఆగడాలను పోలీసులు గుర్తించారు. నెల్లూరు నగరంలోని బోడిగానితోటలో నివాసం ఉంటున్న అరుణ గంజాయి దందా నిర్వహిస్తోంది. పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టగా షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. అరవ కామాక్షికి వంశపారపర్యంగా ఆస్తులు సంక్రమించినట్లు నేర ప్రవృత్తి కూడా అలాగే వచ్చినట్లు తేలింది. ఆమె తల్లిదండ్రులు గతంలో ఈ రకమైన దందాలు ముఠా ఏర్పాటు చేసుకుని దాడులు, దోపిడీలకు పాల్పడే చరిత్ర ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. నగరంలో వీధుల్లో చెత్త, ప్లాస్టిక్ వ్యర్ధాలు ఏరుకుని అమ్ముకునే వృత్తిలో ఉంటున్న చిన్నపిల్లలను చేరదీసేది. వారి ద్వారా జూనియర్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీల వద్ద చివరకు పాఠశాల వద్ద విద్యార్థులకు గంజాయి అమ్మకాలు చేయిస్తున్నట్లు తేలింది.