ముఖ్య భేటీతో రేవంత్ రెడ్డి రాజకీయ సంచలనం సృష్టిస్తున్నారా?
పయనించే సూర్యుడు న్యూస్ :ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ను సోనియా గాంధీకి అందజేశారు. డిసెంబర్ 8,9 తేదీల్లో రెండు రోజులపాటు నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 వివరాలను ఆమెకు వివరించారు. ప్రజా పాలనలో రెండేళ్లుగా అమలు జరుగుతున్న సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, భవిష్యత్ ప్రణాళికలను సోనియా గాంధీకి వివరించారు. ప్రజా ప్రభుత్వ పనితీరు, రాష్ట్ర అభివృద్ధి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి దూరదృష్టిని సోనియా గాంధీ ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్‌కు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తెసుకెళ్లాలని ఆకాంక్షిస్తూ సీఎం రేవంత్ రెడ్డికి సోనియా గాంధీ శుభాకాంక్షలు తెలిపారు.అదే విధంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుకు సహకరించాలని కేంద్ర మంత్రికి సీఎం వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌తో ప్రత్యక్షంగా, పరోక్షంగా 4 లక్షల మంది విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు తెలిపారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం, ఇతర విద్యా సంస్థల ఏర్పాటుకు రూ.30 వేల కోట్ల వ్యయమవుతుందని కేంద్ర మంత్రికి తెలిపారు. ఈ మొత్తానికి తీసుకునే రుణాలకు ఎఫ్ఆర్‌బీఎం నుంచి మినహాయించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను సీఎం కోరారు.