ముమ్మిడివరం పురపాలక అభివృద్ధికి రూ.257.59 కోట్ల నిధులు
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 22 ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ) కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పురపాలకాల్లో ప్రజలకు సురక్షిత తాగునీరు, సమర్థవంతమైన మురుగునీటి పారుదల,సుస్థిర ఘన వ్యర్థాల నిర్వహణ,చెత్త డంపింగ్ రహిత పట్టణాలు, సిమెంటు,తారు రోడ్లు,డివైడర్లు,వీధి దీపాలు,పార్కులు,ఆట స్థలాలు వంటి మౌలిక వసతులకు ప్రాధాన్యత ఇస్తున్నామని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రభుత్వ విప్,ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు తెలిపారు.ముమ్మిడివరం నగర పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర నిధుల ద్వారా పట్టణ అభివృద్ధికి అవసరమైన నిధులు సమకూర్చి పనులు చేపడుతున్నామన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్తంగా వివిధ పురపాలకాల్లో చేపట్టనున్న సుమారు రూ.5,500 కోట్ల అభివృద్ధి పనులకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారని తెలిపారు.ఇందులో భాగంగా ముమ్మిడివరం పురపాలకానికి రూ.12 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగిందని, అనుమతులు రావడంతో త్వరలో పనులు ప్రారంభమవు తాయని వెల్లడించారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముమ్మిడివరం నగర పంచాయతీకి మొత్తం రూ.257.59 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు.అమృత్ 2.0 ద్వారా తాగునీటికి రూ.16.64 కోట్లు,స్వచ్ఛ భారత్ ద్వారా ఘన,ద్రవ వ్యర్థాల నిర్వహణకు రూ.1.47 కోట్లు,అంతర్జాతీయ బ్యాంకు ద్వారా తాగునీరు,మురుగు కాలువల అభివృద్ధికి రూ.191.43 కోట్లు,రోడ్లు,మురుగు కాలువలకు రూ.6.50 కోట్లు మంజూరయ్యాయన్నారు.అలాగే రహదారుల అభివృద్ధికి రూ.12 కోట్లు,మురుగు కాలువల అభివృద్ధికి రూ.30 కోట్లు కేటాయించామని,వీటికి త్వరలో పరిపాలనా అనుమతులు వచ్చాక పనులు ప్రారంభిస్తామన్నారు.ముమ్మిడివరం నగర పంచాయతీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన వసతులు అందిస్తామని పేర్కొన్నారు. ముమ్మిడివరం అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,పురపాలక శాఖ మంత్రి నారాయణకు ధన్యవాదాలు తెలిపారు.