యూపీ పాఠశాలల్లో వార్తా పత్రికల పఠనం తప్పనిసరి ఆ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు
పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 29 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
విద్యార్థుల రోజువారీ కార్యకలాపాల్లో వార్తాపత్రికల పఠనాన్ని తప్పనిసరి చేయాలని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు మార్గదర్శకాలు జారీచేసింది. ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలను చూసే సమయాన్ని తగ్గించి, పుస్తక పఠన సంస్కృతిని బలోపేతం చేయడానికి ఈ నిర్ణయం తీసుకుంది. పాఠశాల గ్రంథాలయాల్లో ఆంగ్ల, హిందీ వార్తాపత్రికలను అందుబాటులో ఉంచాలని ఈ నెల 23న జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రతిరోజూ ఉదయం విద్యార్థుల్ని సమావేశపరిచే సమయంలో కనీసం పది నిమిషాల సమయాన్ని వార్తాపత్రికల పఠనానికి కేటాయించాలని స్పష్టంచేసింది.ఈ సమయంలో వంతులవారీగా విద్యార్థులు వార్తాపత్రికల్లోని ప్రధాన వార్తలను, సంపాదకీయాల్లో ముఖ్యాంశాలను, జాతీయ/ అంతర్జాతీయ/ క్రీడావార్తలను చదివి వినిపిస్తారు. ‘నేటి పదం’ రూపంలో వార్తాపత్రికల నుంచి అయిదు క్లిష్టమైన పదాలను గుర్తించి, నోటీసు బోర్డుపై రాయాల్సి ఉంటుంది. దీనివల్ల విద్యార్థుల పదజాలం మెరుగవుతుంది.వార్తాపత్రికలను చదవడం వలన విజ్ఞానం పెరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు