PS Telugu News
Epaper

రూట్ మార్చిన విజయ్ దేవరకొండ – ‘రౌడీ జనార్ధన’ టీజర్‌పై విశ్లేషణ

📅 23 Dec 2025 ⏱️ 11:27 AM 📝 సినిమా-వార్తలు
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ : అభిమానులు ప్రేమగా రౌడీ స్టార్ అంటూ పిలుచుకునే టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ.. రూట్ మార్చాడు. ఇప్పుడాయ‌న క‌థానాయ‌కుడిగా రూపొందుతోన్న చిత్రం ‘రౌడీ జనార్ధన’. రాజావారు రాణిగారు ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఈ వ‌యొలెంట్ డ్రామా తెర‌కెక్కుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు దీన్ని పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. 2026 డిసెంబర్‌లో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు మేక‌ర్స్‌. తాజాగా ఈ చిత్రం టీజర్‌ను గురువారం విడుద‌ల చేశారు. సినిమా రిలీజ్‌కు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉండగానే టీజర్ విడుదల చేయడం చూస్తుంటే.. ప్రమోషన్ విషయంలో మేకర్స్ ఎంత పెద్ద ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నారో అర్థమవుతోంది.రెండు నిమిషాల నిడివి ఉన్నరౌడీ జ‌నార్ధ‌న్‌ టీజర్‌లో కథను పూర్తిగా రివీల్ చేయకుండా ప్రధాన పాత్ర స్వభావాన్ని మాత్రమే ఇంటెన్స్‌గా పరిచయం చేశారు. షూటింగ్ ఇంకా కీలక దశలకు చేరుకోవాల్సి ఉండటంతో విజువల్స్‌ను కూడా చాలా వరకు దాచిపెట్టారు. టీజ‌ర్‌ను గ‌మ‌నిస్తే..  ‘కళింగపట్నం’ అనే ఊరు మొత్తం రౌడీల రాజ్యంలా కనిపిస్తుంది. అయితే వాళ్లు రౌడీల‌మ‌ని చెప్పుకుంటారు. కానీ ఒక‌డు మాత్ర‌మే ఇంటి పేరుని రౌడీగా మార్చుకున్నాడు. అత‌రు జనార్ధన (విజయ్ దేవరకొండ) అలియాస్ రౌడీ జ‌నార్ధ‌న అనే యువకుడు. అడ్డొచ్చిన వారిని ఎదుర్కొనే విషయంలో వెనుకాడని అతడి ప్రవర్తన వెనుక ఒక విషాదకరమైన బాల్యం దాగి ఉందన్న సంకేతాలను దర్శకుడు టీజర్‌లో డైరెక్ట‌ర్ చూపించాడు. పసితనంలో చూసిన చీకటి అనుభవాలే అతడిని రాక్షస స్వభావం వైపు నడిపించాయన్న ఆలోచ‌న‌ను టీజ‌ర్ రేకెత్తిస్తోంది. అసలు రౌడీ జనార్ధన ఎవరు? అతడి విధ్వంసానికి కారణం ఏమిటి? అన్న ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఇంకో సంవత్సరం పాటు వెయిట్ చేయాల్సిందే.విజువల్స్ పరంగా టీజర్ చాలా ఇంటెన్స్‌గా ఉంది. క్రిస్టో క్సేవియర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కంటెంట్ మూడ్‌కు బలాన్ని చేకూర్చింది. హీరోయిన్ కీర్తి సురేష్‌తో పాటు ఇతర కీలక పాత్రలను టీజర్‌లో పూర్తిగా రివీల్ చేయలేదు. కింగ్డమ్ సినిమాతో నిరాశ ఎదురైనా, అదే జానర్‌లో మరోసారి హిట్ కొట్టేందుకు విజయ్ దేవరకొండ గట్టి ప్రయత్నం చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. పాత్ర కోసం దేహాన్ని మలుచుకున్న విధానం, కొనతిరిగిన మీసకట్టు, కొత్తగా అనిపిస్తున్న స్లాంగ్ అన్నీ అభిమానులు కోరుకున్న ‘రౌడీ’ ఇమేజ్‌ను మరోసారి గుర్తు చేస్తున్నాయి. అయితే టీజర్‌లో వాడిన కొన్ని పదాలపై సోషల్ మీడియాలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాల్సి ఉంది. మొత్తానికి ‘రౌడీ జనార్ధన’ టీజర్‌తో విజయ్ దేవరకొండ అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగాయి.

Scroll to Top