విద్యార్థులపై లాఠీచార్జిని తీవ్రంగా ఖండించిన వైరా మున్సిపల్ వైస్ చైర్మన్ కట్ల సంతోష్
విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది
కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి: కట్ల సంతోష్
పయనించే సూర్యుడు జులై 21 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ : వైరా:ఢిల్లీలో విద్యార్థులు, యువత చేపట్టిన శాంతియుత నిరసనపై పోలీసులు లాఠీచార్జి చేయడం, టియర్ గ్యాస్ ప్రయోగించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని వైరా మున్సిపల్ వైస్ చైర్మన్ కట్ల సంతోష్ తీవ్రంగా ఖండించారు.విద్యా వ్యవస్థలో నెలకొన్న అవకతవకలు, నీట్, జేఈఈ పరీక్షల పేపర్ లీకేజీలు తదితర అంశాలపై పార్లమెంట్‌కు ర్యాలీగా వెళ్తున్న విద్యార్థులు, యువతపై ఢిల్లీ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి రోడ్డుపై ఈడ్చుకుంటూ విచక్షణారహితంగా లాఠీచార్జి చేయడం, టియర్ గ్యాస్ ప్రయోగించడం దారుణమని ఆయన పేర్కొన్నారు.దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విద్యార్థుల భవిష్యత్తును కాపాడాల్సింది పోయి వారి గొంతును అణచివేసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. విద్యా వ్యవస్థలో జరిగిన వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.దేశ చరిత్రలో ఈ ఘటన ఒక చీకటి రోజుగా నిలిచిపోతుందని పేర్కొన్న కట్ల సంతోష్, విద్యార్థులపై నమోదు చేసిన కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అలాగే, ఈ ఘటనపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుమోటోగా స్వీకరించి సమగ్ర నివేదిక తెప్పించి, విద్యార్థుల హక్కుల ఉల్లంఘనకు బాధ్యులైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.విద్యార్థులు తమ హక్కుల కోసం శాంతియుతంగా నిరసన తెలిపే రాజ్యాంగబద్ధ హక్కును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని, బలప్రయోగంతో ఉద్యమాలను అణచివేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని కట్ల సంతోష్ పేర్కొన్నారు