PS Telugu News
Epaper

విద్యార్థుల పఠన సామర్థ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి..

📅 18 Mar 2026 ⏱️ 7:03 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

టేకులపల్లి మండలం పర్యటనలో జిల్లా కలెక్టర్ అంకిత్

పయనించె సూర్యుడు మార్చి 18(పొనకంటి ఉపేందర్ రావు )

భద్రాది కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ బుధవారం టేకులపల్లి మండలంలో విస్తృత స్థాయిలో ఆకస్మిక పర్యటన నిర్వహించారు. ఈ పర్యటనలో పదవ తరగతి పరీక్షలు, విద్యార్థుల పఠన సామర్థ్యం, పాఠశాల మౌలిక సదుపాయాలు, ప్రజలకు అందుతున్న వైద్య సేవల నిర్వహణను సమగ్రంగా తనిఖీ చేశారు.ముందుగా టేకులపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న పదవ తరగతి పరీక్షలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ విధానం, విద్యార్థుల హాజరు శాతం, పర్యవేక్షణ చర్యలను సమీక్షించి, విద్యార్థులకు అందుతున్న మౌలిక సదుపాయాలపై సంబంధిత ఉపాధ్యాయుల నుండి వివరాలు పొందారు. ఈ పరీక్షా కేంద్రంలో 180 మంది విద్యార్థులు కేటాయించగా అందరూ హాజరయ్యారని అధికారులు కలెక్టర్ కు తెలిపారు. కలెక్టర్ అన్ని ఏర్పాట్లు సమగ్రంగా ఉండి ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించబడేలా చూడాలని సూచించారు. మాస్ కాపీయింగ్‌కు ఏవైనా అవకాశాలు ఉండకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేపట్టాలని, పరీక్షా పత్రాల నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టంగా ఆదేశించారు. అదనంగా, ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్షా కేంద్రాలకు అనుమతించరాదు అని హెచ్చరించారు.పాఠశాల భవనాలను పరిశీలించిన సందర్భంలో స్లాబ్ పెచ్చులు ఊడిపోవడం, ఆవరణలో పరిశుభ్రతలేమి ఉండటం గమనించి అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి, భవనాలకు అవసరమైన మరమ్మత్తులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. పరీక్షల సమయంలో విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ స్పష్టంగా సూచించారు.
అనంతరం కోయగూడెం ప్రాథమిక బాలుర ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి, తరగతి గదులను సందర్శించారు. 9వ తరగతి విద్యార్థుల ఇంగ్లీష్, తెలుగు పాఠ్యపుస్తకాలను చదివించి, వారి పఠన సామర్థ్యాన్ని పరిశీలించారు. పాఠ్యాంశాలు చదవడంలో వెనుకబడిన విద్యార్థుల పరిస్థితిని గమనించి, ఉపాధ్యాయులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పఠన సామర్థ్యం విద్యార్థుల భవిష్యత్తుకు పునాది, కాబట్టి తక్షణ చర్యలు చేపట్టాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.కలెక్టర్ పాఠశాల కిచెన్ షెడ్, వాటర్ ప్లాంట్, గ్యాస్ సిలిండర్లు, ఆర్‌ఓ ప్లాంట్ వంటిమౌలికసదుపాయాలను పరిశీలించారు. ఆర్‌ఓ ప్లాంట్లకు అవసరమైన మరమ్మత్తులు చేయడం లేదా కొత్త వాటిని ఏర్పాటు చేసి, ప్రతి పాఠశాలలో సురక్షితమైన మంచినీరు అందించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వంటగదిలో పనిచేస్తున్న సిబ్బందితో మాట్లాడి ఆహార నాణ్యత, పరిశుభ్రతపై పర్యవేక్షణ చేశారు.ఈ పర్యటనలో భాగంగా, ముత్యాలంపాడు క్రాస్ రోడ్ వద్ద ప్రగతి ప్రణాళికలో లో భాగంగా 99 రోజుల కార్యాచరణలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని కలెక్టర్ సమగ్రంగా పరిశీలించారు. శిబిరంలో అందుబాటులో ఉన్న వైద్యుల సంఖ్య, నిర్వహించిన వైద్య పరీక్షలు, లబ్ధి పొందిన రోగుల వివరాలను తెలుసుకున్నారు. సుమారు 200 మంది శిబిరాన్ని సందర్శించగా, 100 మందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించబడినట్లు వైద్యులు తెలిపారు. బీపీ, షుగర్, ల్యాబ్ పరీక్షలు, గైనకాలజీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, పీడియాట్రిక్, డెంటల్, ఆఫ్తమాలజీ విభాగాల సేవలను కలెక్టర్ సమగ్రంగా సమీక్షించారు. రోగులకు అవసరమైన మందులు ఉచితంగా అందించడం, అవసరమైతే పై స్థాయిఆసుపత్రులకు రిఫర్ చేయడం వంటి చర్యలు తీసుకున్నారు.ఈ పర్యటనలో కలెక్టర్ వెంట మండల ప్రత్యేక అధికారి శ్రీరామ్, తాసిల్దార్, ఎంపీడీవో, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, బోధన బోధన, బోధనేతర సిబ్బంది,మెడికల్ డాక్టర్ అధికారి వెంకటేష్, డాక్టర్ దేవా, సిహెచ్ఓ పార్వతి, టిహెచ్ఎన్ చంద్రకళ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top