సమాజ మార్పు కోసం విజన్ కంటే బాధ్యత ముఖ్యం… చంద్రబాబు వ్యాఖ్యలు చర్చనీయాంశం
పయనించే సూర్యుడు న్యూస్ :డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా గుర్తుండి పోతారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతి శాసనసభా ప్రాంగణంలో ఈ మాక్ అసెంబ్లీలో వాడీవేడిగా చర్చ జరిగింది. ఈ మాక్ అసెంబ్లీకి సీఎం చంద్రబాబు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. విజన్ ఒక్కటే ఉంటే సరిపోదన్నారు. విజన్‌తో పాటు దానిని అమలు చేయడం కూడా ముఖ్యమన్నారు. అంతకేకాకుండా కఠోర శ్రమతో పాటు నిరంతరం చేయాలనే తపన ఉంటేనే అనుకున్నది సాధిస్తామని చెప్పారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడంతో పనులు సులువుగా చేయవచ్చన్నారు. అన్ని ఆటంకాలను అధిగమించి ముందుకు నడుచుకోవాలన్నారు. నేను చాలా చిన్న వయసులో ఎమ్మెల్యేగా గెలుపొందానని, ఆ తర్వాత ఏకంగా నాలుగు సార్లు సీఎంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మాక్ అసెంబ్లీలో విద్యార్థులు చాలా చక్కగా మాట్లాడారని, ఎక్కడా కూడా తడపడకుండా మాట్లాడడం హర్షణీయమన్నారు.ఇదిలా ఉండగా, మాక్ అసెంబ్లీలో మాక్ సీఎంగా మన్యం జిల్లాకు చెందిన ఎం.లీలాగౌతమ్, ప్రతిపక్ష నేతగా అదే జిల్లాకు చెందిన సౌమ్య వ్యవహరించారు. అలాగే డిప్యూటీ సీఎంగా విశాఖ జిల్లాకు చెందిన కోడి యోగి, విద్యాశాఖ మంత్రిగా తిరుపతి జిల్లాకు చెందిన చిన్మయి, అసెంబ్లీ స్పీకర్‌గా కాకినాడ జిల్లాకు చెందిన స్వాతి ఉన్నారు. అసెంబ్లీలో పలు బిల్లులుపై చర్చించారు. అయితే మొత్తం 45 వేల పాఠశాలల్లో మాక్ అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఇందులో భాగంగానే విద్యార్థులకు రాజ్యాంగం, ప్రజాస్వామ్య ప్రక్రియలపై అవగాహన కల్పించే లక్ష్యంతో మాక్ అసెంబ్లీ నిర్వహించాలన్న తన ఆలోచనని మంత్రి లోకేష్ ఇటీవల అసెంబ్లీలో ప్రతిపాదించగా సభ్యులంతా మద్దతు తెలిపారు. దీంతో వివిధ స్థాయిలలో విద్యార్థులకు పలు రకాల పోటీలు పెట్టి నియోజకవర్గ స్థాయిలో ఒక్కొక్కరిని ఎంపిక చేశారు. ఈ మేరకు ఏపీ విద్యార్థుల మాక్ అసెంబ్లీలో వాడీవేడిగా చర్చ జరిగింది.