PS Telugu News
Epaper

సర్పంచ్ ఎన్నికలపై సంచలన వ్యాఖ్య — రాజకీయ వర్గాల్లో చర్చ

📅 28 Nov 2025 ⏱️ 11:06 AM 📝 తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. గ్రామాల్లో సర్పంచ్‌ ఎన్నికలంటనే పండుగ వాతావరణం నెలకొంటుంది. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఎన్నికలు ముగిసేదాకా ఆ కిక్కే వేరు. కానీ.. వరంగల్‌లోని ఈ గ్రామంలో మాత్రం ఓ వింత సమస్య ఆశావహులకు గండంలా మారింది. ఊరంతా ఒకే మాట.. అందరిదీ ఒక్కటే సమస్య. అదే కోతుల బెడద. గ్రామానికి ఇంకే పనీ చేయకపోయినా పర్వాలేదు. కోతుల బెడద తీర్చేస్తే చాలు.. సర్పంచ్‌గా ఎన్నుకుంటామంటోంది వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని ఇల్లంద గ్రామం. ఈ గ్రామ పంచాయతీ పరిధిలో మొత్తం 5వేల 400 మంది ఓటర్లు ఉన్నారు. ఈ గ్రామంలో కోతుల సంఖ్య మాత్రం అంతకు నాలుగు రెట్లు ఎక్కువ.. అంటే, 20 వేలకు పైనే ఉంటాయి. ఆ వానర సేనలు సృష్టిస్తున్న బీభత్సం అంతా ఇంతా కాదు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటే భయం, భయం. పిల్లలు, మహిళలు, వృద్ధులు ఒంటరిగా నడిచి వెళ్ళాలంటేనే జంకుతున్నారు. పొరపాటున ఇంటి డోర్ తెరిచి ఉంచారంటే వంట సామాగ్రి మాయం.. ఇళ్లంతా సంతలా మారుతోంది. అన్నం, కూర గిన్నెలు చెట్లపైకి వెళ్తున్నాయి. కోతుల బెడద నుండి నిత్యం నరకం అనుభవిస్తున్న ఈ గ్రామస్తులు.. వాటిని తరిమికొట్టిన వారికే సర్పంచ్ పదవి అంటూ ప్రకటించారు. ఎంపీటీసీ పదవి కావాలన్నా ఇదే కండీషన్. కోతుల బాధతో ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు.. స్థానిక ప్రజా ప్రతినిధులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదు. గతంలో ఎన్నికల సమయంలో కోతుల సమస్య తీరుస్తామంటూ ఓట్లు వేయించుకున్న నేతలు.. ఆ తర్వాత సరైన శ్రద్ధ పెట్టలేదు. దీంతో కోతుల సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది. ఇప్పుడు మరోసారి స్థానిక ఎన్నికలకు సమయం ఆసన్నం కావడంతో.. ఇదే సరైన అవకాశంగా భావిస్తున్నారు. కోతుల సమస్య తీర్చాల్సిందేనంటూ ఓట్లు అడగడానికి వచ్చే ఆశావహులకు తెగేసి చెప్తున్నారు. ఓటుకు నోటు వద్దే వద్దు. కొత్త రోడ్లు వేయకపోయినా పర్వాలేదు. గొంతెమ్మ కోరికలు ఏమీ లేవు. కేవలం కోతులను తరమండి చాలు.. అని అంటోంది ఇల్లంద గ్రామం.

Scroll to Top