PS Telugu News
Epaper

స్క్రబ్ టైఫస్ అలర్ట్! కేసుల పెరుగుదలపై సీఎం చంద్రబాబు అత్యవసర చర్యలు

📅 10 Dec 2025 ⏱️ 12:35 PM 📝 ఆంధ్రప్రదేశ్
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :ఆంధ్రప్రదేశ్‌లో ఆందోళన కలిగిస్తోన్న ‘స్క్రబ్‌ టైఫస్‌’పై ఫోకస్‌ పెట్టింది ప్రభుత్వం. వ్యాధి నియంత్రణే లక్ష్యంగా సమగ్ర అధ్యయనం కోసం జాతీయస్థాయి నిపుణులతో టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేస్తోంది. ‘స్క్రబ్‌ టైఫస్‌’పై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు.. వైద్యారోగ్యశాఖకు కీలక సూచనలు చేశారు. అపరిశుభ్రతే అసలు జబ్బన్నారు. ఈ అపరిశుభ్రతే అనేక వ్యాధులను మూలకారణమని.. పరిశుభ్రతపై ప్రజల్లో విస్తృత చైతన్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పరిశుభ్రతపై ప్రజల్లో అవేర్‌నెస్‌ వచ్చినప్పుడే.. ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.‘స్క్రబ్‌ టైఫస్‌’ వ్యాధిని తేలిగ్గా తీసుకోవద్దని అధికార యంత్రాంగాన్ని హెచ్చరించారు చంద్రబాబు. తక్షణమే జాతీయ-అంతర్జాతీయ నిపుణులతో చర్చించి.. పరిష్కార మార్గాన్ని కనుక్కోవాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి, వ్యాధి వ్యాప్తికి గల కారణాలేంటో విశ్లేషించి.. నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని సూచించారు. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఇచ్చే నివేదిక ఆధారంగా వ్యాధి నియంత్రణకు పటిష్టమైన కార్యాచరణ అమలుచేయాలని దిశానిర్దేశం చేశారు చంద్రబాబు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1592 ‘స్క్రబ్‌ టైఫస్‌’ కేసులు రికార్డైనట్టు సీఎంకి నివేదించారు అధికారులు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 420 కేసులు నమోదైనట్టు చెప్పారు. అయితే, ‘స్క్రబ్‌ టైఫస్‌’తో మరణించినట్టు ఎక్కడా నిర్ధారణ కాలేదన్నారు. అనుమానిత మరణాలుగా నమోదైన 9 కేసులను పరిశీలించగా.. అవన్నీ తీవ్ర ఆరోగ్య సమస్యలు, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌ కారణంగానే జరిగినట్టు తేలిందన్నారు. ‘స్క్రబ్‌ టైఫస్‌’పై ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తున్నామని, ప్రభావిత ప్రాంతాల్లో్ ప్రత్యేక వైద్యబృందాలతో పరీక్షలు నిర్వహిస్తున్నట్టు చెప్పుకొచ్చారు.గతేడాదితో పోలిస్తే.. సీజన్‌ వ్యాధులు 48శాతం తగ్గాయి. అయితే, పరిశుభ్రతను పెంచడం ద్వారా సీజనల్‌ వ్యాధుల్ని సున్నా స్థాయికి తీసుకురావాలని లక్ష్యాన్ని విధించారు చంద్రబాబు. అపరిశుభ్రతే.. సమాజంలో అతిపెద్ద జబ్బని.. దానిపై యుద్ధం ప్రకటించాలని పిలుపునిచ్చారు సీఎం. ఏదేమైనా, చాపకింద నీరుగా, తలగడ లోపల నల్లిలా.. విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్‌పై జాగ్రత్త తప్పనిసరి..

Scroll to Top