
పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 20 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
మొబైల్ ఫోన్ లో గంట సేపు రీల్స్ చూస్తే కంటి అలసట ఖాయం సోషల్ మీడియా కంటెంట్‌తోనే ఎక్కువ నష్టం అని అధ్యయనం భారతీయ యువతపై ఎస్‌ఆర్‌ఎం ఇన్‌స్టిట్యూట్ పరిశోధన 83 శాతం మందిలో మానసిక, శారీరక సమస్యలు నిరంతర స్క్రీన్ మార్పులే కళ్లపై ఒత్తిడికి కారణం మీరు స్మార్ట్‌ఫోన్‌లో గంటల తరబడి సోషల్ మీడియా రీల్స్ చూస్తూ సమయం గడుపుతున్నారా? అయితే మీ కళ్ల ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లేనని తాజా అధ్యయనం ఒకటి హెచ్చరిస్తోంది. కేవలం గంటపాటు స్మార్ట్‌ఫోన్‌లో సోషల్ మీడియా రీల్స్ స్క్రోల్ చేయడం వల్ల కళ్లు తీవ్రమైన అలసటకు గురవుతాయని పరిశోధకులు తేల్చారు. ఫోన్‌ను ఎంత సేపు వాడామన్నదే కాదు, దానిలో ఎలాంటి కంటెంట్ చూస్తున్నామనేది కూడా చాలా ముఖ్యమని ఈ పరిశోధన స్పష్టం చేసింది. ఎస్‌ఆర్‌ఎం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు జరిపిన ఈ అధ్యయన వివరాలు ‘జర్నల్ ఆఫ్ ఐ మూవ్‌మెంట్ రీసెర్చ్’లో ప్రచురితమయ్యాయి. పుస్తకాలు చదవడం లేదా వీడియోలు చూడటంతో పోలిస్తే, సోషల్ మీడియా రీల్స్ చూస్తున్నప్పుడు మన కంటి పాపలో ఎక్కువ మార్పులు చోటుచేసుకుంటాయని వారు కనుగొన్నారు. రీల్స్‌లో స్క్రీన్ వెలుతురు, దృశ్యాలు వేగంగా మారుతూ ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని వివరించారు. దీనివల్ల రెప్పపాటు వేగం తగ్గి, కళ్లు పొడిబారిపోయి తీవ్రమైన ఒత్తిడికి గురవుతాయని తెలిపారు. ఈ అధ్యయనం కోసం కొందరు యువతీ యువకులపై పరిశోధన జరిపారు. గంటపాటు స్మార్ట్‌ఫోన్ వాడిన తర్వాత వారిలో కలిగే మార్పులను ప్రత్యేక పరికరంతో విశ్లేషించారు. ఇందులో పాల్గొన్న వారిలో ఆరవై శాతం మంది కంటి అలసట, మెడ నొప్పి, చేతుల నొప్పుల వంటి తీవ్రమైన అసౌకర్యానికి గురైనట్లు చెప్పారు. ఆందోళన కలిగించే మరో విషయం ఏమిటంటే, వీరిలో 83 శాతం మంది నిద్రలేమి, మానసిక ఆందోళన, అలసట వంటి శారీరక, మానసిక రుగ్మతలతో బాధపడుతున్నట్లు అంగీకరించారు.నిరంతరాయంగా ఇరవై నిమిషాలకు మించి స్మార్ట్‌ఫోన్ వాడటం శారీరక, మానసిక ఆరోగ్యానికి హానికరమని పరిశోధకులు హెచ్చరించారు. స్క్రీన్ నుంచి వెలువడే బ్లూ లైట్ వల్ల కంటి సమస్యలతో పాటు నిద్ర సంబంధిత రుగ్మతలు కూడా వస్తాయని పేర్కొన్నారు. అయితే, అధ్యయనంలో పాల్గొన్న వారిలో నలబై శాతం మంది బ్లూ లైట్ ఫిల్టర్లు, డార్క్ మోడ్ వంటి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పడం గమనార్హం.