20 ఏళ్లు కళ్లచీకటిలో ఉన్న యువతి బయటకు రాగానే చూపు కోల్పోవడం
పయనించే సూర్యుడు న్యూస్ :కాసేపు చీకటిలో ఉండి వెలుగులోకి రాగానే కళ్లకు కాసేపు ఇబ్బందికరంగా ఉంటుంది. కొంతసమయం తర్వాత సెట్ అయి వెలుతురును చూడగల్గుతాము. అలాంటిది ఏళ్లతరబడి చీకటిలో ఉండి ఒక్కసారిగా వెలుతురులోకి వస్తే ఇంకెలా ఉంటుంది? సరిగ్గా అలాంటి సంఘటనే ఒకటి ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది. 20 ఏళ్లుగా యువతి చీకటిలో ఉన్న కారణంగా వెలుగులోకి రాగానే ఆమె కంటిచూపును కోల్పోయింది. ఛత్తీస్‌గఢ్ లోని బస్తర్ జిల్లాలో ఈ హృదయవిదారకమైన ఘటన వెలుగులోకి వచ్చింది. భద్రత పేరుతో ఓ తండ్రి తన కూతురిని ఏకంగా 20 ఏళ్ల పాటు చీకటి గదిలో బంధించాడు. ఇటీవల అధికారులు ఆమెను రక్షించి బయటకు తీసుకువచ్చారు. అయితే, సుదీర్ఘకాలంగా వెలుగు చూడకపోవడంతో ఆమె తన కంటిచూపును దాదాపు పూర్తిగా కోల్పోయింది. బకావండ్ గ్రామానికి చెందిన లీసా అనే యువతికి ఆరేళ్ల వయసులో ఈ నరకం మొదలైంది. 2000 సంవత్సరంలో ఆమె రెండో తరగతి చదువుతున్నప్పుడు, గ్రామస్థుడు ఒకరు ఆమెను చంపేస్తానని బెదిరించాడు. ఆ బెదిరింపుతో తీవ్ర భయాందోళనకు గురైన లీసా, బయటకు రావాలంటేనే భయపడేది. భార్యను కోల్పోయి, ఒంటరివాడైన ఆమె తండ్రి.. తన కూతురిని ఎలా కాపాడుకోవాలో తెలియక, ఆమెను ఇంట్లోని ఓ కిటికీలు లేని గదిలో బంధించాడు. గత 20 ఏళ్లుగా ఆ చీకటి గదే ఆమె ప్రపంచమైంది. ఆమెకు ఆహారం పెట్టడానికి మాత్రమే ఆ గది తలుపు తెరిచేవాడు తండ్రి. విషయం తెలుసుకున్న సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు ఇటీవల ఆమెను బయటకు తీసుకొచ్చారు. అయితే ఆమె మనుషులను చూసి భయపడటం, కనీసం తన పేరుకు కూడా స్పందించలేని స్థితిలో ఉంది. సుదీర్ఘకాలం కాంతికి దూరంగా ఉండటంతో ఆమె కంటిచూపు తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువని వైద్యులు తెలిపారు. మానసికంగా కూడా ఆమె ఎదుగుదల పూర్తిగా నిలిచిపోయిందని వెల్లడిచారు. ప్రస్తుతం లీసాను ఓ ఆశ్రమంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. తమకు సమాచారం అందగానే ఆమెను రక్షించామని, ఆమె ఇప్పుడు సురక్షితంగా ఉందని అధికారులు తెలిపారు. మొదట్లో మనుషులను చూసి భయపడేది. ఇప్పుడు నెమ్మదిగా మాట్లాడుతోందని పేర్కొన్నారు. ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం విచారణకు ఆదేశించింది. విచారణ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.