నిర్మల్ జిల్లాలో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా, ప్రైవేట్ పాఠశాలల ముసుగులో నడుస్తున్న గురుకుల, నవోదయ, సైనిక్ కోచింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి: (ఎస్ ఎఫ్ ఐ) డిమాండ్

June 8, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో నిర్మల్ జిల్లా వ్యాప్తంగా విద్యాశాఖ నిబంధనలను బేఖాతరు చేస్తూ, ప్రైవేట్ పాఠశాలల ముసుగులో అక్రమంగా కొనసాగుతున్న గురుకుల, నవోదయ, సైనిక్ స్కూల్ కోచింగ్ సెంటర్ల వ్యాపారీకరణపై భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ ఎఫ్ ఐ) నిర్మల్ జిల్లా కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం లాభార్జనే ధ్యేయంగా విద్యా చట్టాలను ఉల్లంఘిస్తూ, విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న యాజమాన్యాలపై తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది.ఈ సందర్భంగా (ఎస్ ఎఫ్ ఐ) నిర్మల్ జిల్లా కన్వీనర్ దిగంబర్ మాట్లాడుతూ జిల్లాలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమాలను లేవనెత్తారు: *నిబంధనల ఉల్లంఘన* : సాధారణ పాఠశాలలుగా అనుమతులు పొంది, వాటి పరిధి దాటి లోపల గురుకుల, నవోదయ, సైనిక్ ఎంట్రన్స్ పరీక్షల కోసం ప్రత్యేక కోచింగ్ సెంటర్లు నడపడం ముమ్మాటికీ చట్టవిరుద్ధం. విద్యాశాఖ నిబంధనలను, జీవోలను ఈ సంస్థలు పూర్తిగా తుంగలో తొక్కుతున్నాయి. *ఫీజుల దోపిడీ* : గ్రామీణ, పట్టణ ప్రాంతాల అమాయక తల్లిదండ్రులకు ర్యాంకులు, సీట్ల పేరుతో ఆశలు చూపిస్తూ, వేలాది రూపాయల ఫీజులను అక్రమంగా వసూలు చేస్తూ పగటి దొంగతనానికి పాల్పడుతున్నారు. **విద్యార్థులపై మానసిక ఒత్తిడి* : చిన్నారి విద్యార్థులను ఉదయం నుండి రాత్రి వరకు చదువుల పేరుతో ఒకే గదిలో బంధిస్తూ, వారికి కనీస ఆటపాటలు లేకుండా చేస్తూ తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారు. ఇది బాలల హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుంది. *(ఎస్ ఎఫ్ ఐ)నిర్మల్ జిల్లా కమిటీ డిమాండ్లు:* జిల్లా విద్యాశాఖ అధికారులు (డీఈవో) వెంటనే స్పందించి, నిర్మల్ జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల ముసుగులో నడుస్తున్న అన్ని అక్రమ కోచింగ్ సెంటర్లపై తక్షణమే టాస్క్‌ఫోర్స్ తనిఖీలు చేపట్టాలి.ప్రభుత్వ అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా హాస్టళ్లు, కోచింగ్ క్యాంపులు నిర్వహిస్తున్న విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేయాలి.విద్యార్థుల జీవితాలతో, తల్లిదండ్రుల సొమ్ముతో వ్యాపారం చేస్తున్న విద్యాసంస్థల యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.జిల్లా విద్యాశాఖ అధికారులు ఇప్పటికైనా స్పందించి ఈ అక్రమ కోచింగ్ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో SFI ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు, విద్యాశాఖ కార్యాలయాల ముట్టడి చేపడతామని SFI నిర్మల్ జిల్లా కమిటీ హెచ్చరించింది.జిల్లా కమిటీ,భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ ఎఫ్ ఐ) నిర్మల్ జిల్లా.

🌐 Select Language:
📰 ePaper