భైంసా పట్టణంలోని గోపాలరావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రకృతి విపత్తులపై అవగాహన సదస్సు,

July 6, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో : జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డిఆర్ఎఫ్) ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం విద్యార్థులకు అత్యంత ఉపయోగకరంగా నిలిచి అందరి ప్రశంసలు అందుకుంది. ప్రకృతి విపత్తులు ఎప్పుడు, ఎక్కడ సంభవిస్తాయో తెలియని పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ముందస్తు జాగ్రత్తలు తెలుసుకోవడం ఎంతో అవసరమని కార్యక్రమంలో నిపుణులు వివరించారు. భూకంపాలు, వరదలు, అగ్నిప్రమాదాలు, తుఫానులు వంటి విపత్తుల సమయంలో ఎలా అప్రమత్తంగా ఉండాలి, ప్రమాదాల నుంచి ఎలా బయటపడాలి, ఇతరులను ఎలా రక్షించాలి వంటి అంశాలపై విద్యార్థులకు ప్రాక్టికల్ శిక్షణతో కూడిన అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తహసీల్దార్ వై.వి. శేషభూషణ్ గారు మాట్లాడుతూ, విపత్తుల సమయంలో ప్రజలు భయపడకుండా ధైర్యంగా వ్యవహరించి ప్రభుత్వ సూచనలను పాటించాలని సూచించారు. విద్యార్థుల్లో సేవాభావం, అప్రమత్తత మరియు బాధ్యత పెంపొందుతాయని తెలిపారు.ముఖేష్ కుమార్ కమాండర్ ఆధ్వర్యంలోని ఎన్‌డిఆర్ఎఫ్ బృందం విద్యార్థులకు విపత్తుల సమయంలో పాటించాల్సిన అత్యవసర భద్రతా చర్యలను ప్రత్యక్ష ప్రదర్శనల ద్వారా వివరించింది. ముఖ్యంగా గుండెపోటు లేదా శ్వాస ఆడకపోయే పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడేందుకు ఉపయోగపడే సీపీఆర్ (సిపిఆర్) విధానాన్ని ప్రాక్టికల్ రూపంలో చూపించి విద్యార్థులతో చేయించారు. అలాగే ప్రమాద సమయంలో సహాయక బృందాలకు సమాచారం ఎలా అందించాలి, గాయపడిన వారికి ప్రథమ చికిత్స ఎలా అందించాలి వంటి అంశాలను సవివరంగా వివరించారు.కళాశాల ప్రిన్సిపాల్ కర్రోల్ల బుచ్చయ్య గారు మాట్లాడుతూ, విద్యార్థులకు విద్యతో పాటు జీవన నైపుణ్యాలు కూడా అవసరమని, ఇలాంటి అవగాహన కార్యక్రమాలు భవిష్యత్తులో అత్యవసర పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని కలిగిస్తాయని అన్నారు. ఎన్‌డిఆర్ఎఫ్ బృందం అందించిన శిక్షణ ఎంతో విలువైనదని కొనియాడారు.ఈ కార్యక్రమం ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ జే.ఓం ప్రకాష్, డాక్టర్ నహేదా ఆధ్వర్యంలో నిర్వహించబడింది. కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం సభ్యులు డా. జే. భీమారావు, యు రవి కుమార్, డా. సుధాకర్, ఏ. రాజు, దివ్య, డాక్టర్ సంతోష్, డాక్టర్ కల్పన, రాజయ్య, శ్రవణ్య, అబ్దుల్లా, వాహిద్, కిషన్, ముత్యం, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.విద్యార్థులలో భద్రతా అవగాహన పెంపొందించడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషించిందని పాల్గొన్న వారు అభిప్రాయపడ్డారు.

🌐 Select Language:
📰 ePaper