బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం – మంత్రి వాకిటి శ్రీహరి
మళ్లీ కాంగ్రెస్ పార్టీదే అధికారం-మంత్రి వాకిటి శ్రీహరి
బీఆర్ఎస్ నేతల అబద్ధాల మాటలను నమ్మి మోసపోవొద్దు-వాకిటి శ్రీహరి
పయనించే సూర్యుడు జులై 15 ఆలంపూర్ నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటన సందర్భంగా జులేకల్ గ్రామంలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో. కలిసి రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు & క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి.పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఎంపీ డా. మల్లు రవి, ఎమ్మెల్యేలు చిక్కుడు వంశీకృష్ణ, వీర్లపల్లి శంకర్, అనిరుధ్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, కార్పొరేషన్ చైర్మన్లు సరిత తిరుపతి యాదవ్, శివసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి. మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు, బలహీన, తాడిత, పీడిత వర్గాల సంక్షేమానికే కట్టుబడి పనిచేస్తోందని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో రాష్ట్రాన్ని భారీ అప్పుల ఊబిలోకి నెట్టిందని, ఆ ఆర్థిక విధ్వంసాన్ని గాడిలో పెట్టేందుకు తమ ప్రభుత్వానికి రెండున్నర సంవత్సరాలు పట్టిందన్నారు.
ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తన మాట నిలబెట్టు కుందని మంత్రి పేర్కొన్నారు. రైతు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ రైతు భరోసా, రైతు రుణమాఫీ వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. అలాగే ప్రతి పేద కుటుంబానికి నాణ్యమైన సన్నబియ్యం అందించాలనే లక్ష్యంతో రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కును ప్రజలు బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పాలనలో రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) వంటి కీలక ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు.జూరాల, శ్రీశైలం వంటి శాశ్వత సాగునీటి ప్రాజెక్టులు కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో నిర్మించబడినవేనని, కాంగ్రెస్ నిర్మించిన ప్రాజెక్టులు దశాబ్దాల పాటు ప్రజలకు సేవలందిస్తాయని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు శంకుస్థాపనలు, ప్రకటనలకే పరిమితమై ప్రజలను మోసం చేశారని విమర్శించారు.తమ ప్రభుత్వానికి ఎన్నికలు లక్ష్యం కాదని, ప్రజల సంక్షేమం, రైతులకు నిరంతరాయ విద్యుత్, అభివృద్ధి కార్యక్రమాల అమలే ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.వరుస ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీని తిరస్కరించారని, వారి అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. తెలంగాణలో మరోసారి కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేసిన మంత్రి వాకిటి శ్రీహరి, అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.