నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కలెక్టర్ కి ఫోన్ చేసిన మంత్రి
{పయనించే సూర్యుడు} {అక్టోబర్ 1}
కర్ణాటక రాష్ట్రంలో క్లౌడ్ బరెస్ట్ వల్ల కృష్ణానది ఉగ్రరూపం దాల్చింది.ఈ నేపథ్యంలో వరద నీటిని కిందికి వదలటంతో మక్తల్ నియోజకవర్గం కృష్ణా మండలంలోని వాసవినగర్,కుసుముర్తి,ఎస్కె పల్లి,తంగిడి, హిందూపూర్, కుసుమూర్తి,మారుతి నగర్ ప్రాంతాలు నీట మునిగాయి.వరద ఎక్కువగా వస్తుందని సమాచారం అందుకున్న మంత్రి వాకిటి శ్రీహరి అధికారులు అందరిని ముందుగానే అలెర్ట్ చేసి తగిన చర్యలు తీసుకోవాలి అని ఆదేశించారు. మంగళవారం రోజు ముంపు ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పర్యటించి పరిస్థితులు ఏవిధంగా ఉన్నాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2008-09 సంవత్సరంలో భారీ వరద వచ్చింది.ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే ఆ స్థాయిలో వరద రావడం జరిగింది.దాదాపుగా 6.5 క్యూసెక్కులకు పైగా వరద నీరు కిందికి రావడం జరిగింది.అన్ని శాఖలను సమన్వయం చేసి ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల ఎలాంటి నష్టం జరుగలేదు.అయిన సరే ప్రజలు అందరు జాగ్రత్తగా ఉండాలి.ముఖ్యంగా యువత ఏం అవుతుందని ఏమరుపాటుగా ఉండకూడదు.ప్రభావిత ప్రాంతాల ప్రజలను అందరిని గుడే బల్లూరు ప్రభుత్వ పాఠశాల, మేరి పాఠశాలల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఆశ్రయం కల్పించారు.వరదల వల్ల పంట నష్టం బాగా జరిగింది.వరద తగ్గిన తరువాత నష్టాన్ని అంచనా వేసి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ కు ఎమ్మార్వోకు ఆదేశించారు.నష్టపోయిన వారిని ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుంది అన్నారు.



