
పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 7 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి
కేంద్ర ప్రభుత్వం అన్నదాతలకు మరో శుభవార్త అందించడానికి సిద్ధమైంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా 21వ విడత నిధులను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది.జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం, ఈ నిధులను దీపావళి పండుగ కానుకగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరో వారంలోపే ప్రతి రైతుకు రెండు వేల రూపాయల చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ కానున్నాయి. ఈ నిర్ణయంతో కోట్లాది మంది రైతన్నలకు పండుగ సమయంలో ఆర్థిక ఊరట లభించనుంది.ఈ నిధుల విడుదలకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. అయితే, లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసే ప్రక్రియ ఇప్పటికే తుది దశకు చేరుకుందని తెలుస్తోంది. కేంద్రం ఈ పథకం కింద అర్హులైన రైతులందరికీ ఏటా మూడు విడతల్లో మొత్తం ₹6,000 ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ 21వ విడత నగదు బదిలీ ప్రక్రియను పారదర్శకంగా, వేగంగా పూర్తి చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు._ఈ నేపథ్యంలో, పి యం కిసాన్ లబ్ధిదారులు తమ ఖాతాల్లో డబ్బులు జమ కావడానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా చూసుకోవాలని అధికారులు ముఖ్య సూచనలు జారీ చేశారు. ముఖ్యంగా, ఈ కేవైసీ ప్రక్రియను ఇంకా పూర్తి చేయని వారు వెంటనే పూర్తి చేయాలని కోరుతున్నారు. అంతేకాకుండా, ఆధార్ కార్డును బ్యాంక్ ఖాతాతో లింక్ చేయని రైతులు వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ రెండు ముఖ్యమైన పనులు పూర్తి కాకపోతే, నిధులు పొందడంలో జాప్యం జరిగే లేదా నిధులు నిలిచిపోయే అవకాశం ఉందని చ్చరిస్తున్నారు.
పీఎం కిసాన్ పథకం రైతుల ఆదాయాన్ని పెంచడానికి, వారి దైనందిన అవసరాలకు సహాయపడటానికి ఉద్దేశించిన కార్యక్రమం. 21వ విడత నిధులు దీపావళి పండుగ వేళ విడుదల కావడం అనేది రైతు కుటుంబాల్లో మరింత సంతోషాన్ని నింపుతుందనడంలో సందేహం లేదు. అన్నదాతలు తమ వ్యవసాయ పనులకు, ఇతర ఖర్చులకు ఈ డబ్బును వినియోగించుకోవచ్చు. రైతులు తమ వివరాలను సరిచూసుకొని, నగదు జమ అయ్యేందుకు అవసరమైన అన్ని ప్రక్రియలను సకాలంలో పూర్తి చేసుకోవడం ఉత్తమం.